Friday, November 22, 2024

పుష్ప పల్లకిలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరో రోజు మంగళవారం  శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రామరి సమేతుడైన శ్రీశైలేశుడు సర్వాలంకరణ భూషితుడై పుష్పపల్లకిలో విహరించారు. ఉదయం ఆలయంలో చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం శాస్త్రోక్తంగా నిర్వహింఛారు. సాయంకాలార్చనలు, హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రబంతి, పచ్చబంతి, చామమంతి, కనకంబరాలు, డచ్ రోస్ అశోకపత్రాల మాలలు, నందివర్ధనం, గరుడ వర్ధనం, కాగడాలు, అస్సెర్ గ్రాస్, గ్లాడియేలస్ మొదలగు పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకిలో బ్రామరీ సమేత మల్లికార్జునుడు భక్తులను కనువిందు చేశారు. మంగళవాయిద్యాల నడుమ గంగాధర మండపం మొదలుకొని నందిమండపం వరకు.. నందిమండపం నుంచి క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడి ఆలయం వరకు పురవీధుల్లో ఊరేగించారు. గ్రామోత్సవంలో ఈఓ కేఎస్ రామారావు తో పాటు ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహ్మరెడ్డి, పౌరసంభందాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు కృష్ణారెడ్డి, మల్లయ్య, హరిదాస్, డీఈ నర్సింహారెడ్డి, సంపాదకుడు అనీల్ కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, సూపరింటెండెంట్ అయ్యన్న అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement