కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ లో 105 కిలోల వెండి చోరీ కేసులో మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణ బాబులను శనివారం అరెస్టు పోలీసుల అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన భరత్ సింహా, విజయ భాస్కర్ లను కూడా అరెస్టు చేసి కటకటాలకు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ. 10 లక్షల నగదు, 81.52 కేజిల వెండి సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. ఈ కేసు పై ప్రత్యేక దృష్టిని సారించి డిఎస్పీ స్ధాయి అధికారితో దర్యాప్తు చేయించడంతో 48 గంటల్లో చేదించగలిగామని ఎస్పీ వెల్లడించారు. ఏ స్ధాయి అధికారి అయిన శాఖ పరంగా క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కర్నూలు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సిద్దార్థ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మహిళ కానిస్టేబుల్ అమరావతి, ఆమె భర్త, బావమరిది, కానిస్టేబుల్ రమణ బాబు నలుగురు పక్క ప్లాన్తో స్టేషన్లో భద్రపరిచిన సొత్తును దొంగలించారన్నారు. వీరిని
హార్డ్ క్రిమినల్ విచారణ చేయడంతో విషయం బయటపడిందన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కేసు పూర్వాపరాలు
27 జనవరి 2021 తేదీన అప్పటి సీఐ విక్రమ్ సింహా, పోలీస్ స్టాఫ్ తో పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనికీ చేస్తుండగా తమిళ నాడు రాష్ట్రం , సేలం టౌన్ కి చెందిన సంధన్ భారతి గోవింద రాజ్ వెళ్తున్న అతన్ని వాహనాన్ని ఆపి చెక్ చేయగా , అతని వద్ద ఎలాంటి ఆదారాలు, బిల్స్ లేకుండా రూ. 2,05,000 నగదు, 105 కేజి ల వెండి వస్తువులు తనిఖీలలో దొరికాయి, విక్రమ్ సిహ్మ సీఐ పోలీస్ ప్రొసీడింగ్ ద్వారా వాటిని సీజ్ చేసి , ఆ సొమ్ముని భద్ర పరుచుటకు అప్పటి పోలీస్ స్టేషన్ రైటర్ రమణ బాబు కి అప్పగించారు. దాని మీద చర్య తీసుకొనుటకు వాణిజ్య పనుల శాఖకు లేక రాయగా, వారు వెండి వస్తువులకు సంబంధించిన బిల్స్ ని వేరిఫై చేసి, రూ. 35 లక్షలు పెనాల్టీ వేశారు. దీంతో బాధితులు పెనాల్టీ చెల్లించేందుకు తన వద్ద సొమ్ము లేకపోవడంతో వెండి తీసుకునేందుకు ఆలస్యం చేశాడు.
ఈ లోపు ఆ సొమ్మును తమ ఆదీనంలో ఉంచుకున్న అప్పటి రైటర్ రమణ బాబు , వెండి వస్తువులను , పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లోని పోలీస్ స్టాఫ్ రెస్ట్ రూమ్ కి ప్రక్కన ఉన్న ప్రాపర్టీ రూమ్ లో భద్రపరిచారు. రూ. 2,05 లక్షల నగదును పై అధికారులకు తెలియకుండా స్వంత ఖర్చులకి వాడుకున్నారు. అనంతరం కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయ్యాక, సదరు డబ్బు ను, తరువాత రైటర్ గా పని చేసిన అమరావతి కి ఇచ్చి , ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో భద్రపరిచిన వెండి వస్తువులను చూపించి , కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎక్కువ ఫైన్ వేయడంతో ఆ సొమ్ము యజమాని గోవింద రాజ్ సొమ్ముని రిలీజ్ చేసుకొనుటకు ఆశక్తి చూపించడం లేదని వెల్లడించాడు.. దీంతో మహిళా హెడ్ కానిస్టేబుల్ అమరావతి వెంటనే గోవింద రాజ్ కి ఫోన్ చేసి అతనికి నిజంగానే సొమ్ముని రిలీజ్ చేసుకొనుటకు ఇబ్బంది పడుతున్నడని గ్రహించింది.
చోరీ జరిగింది ఎలా
ఆ తర్వాత ఎలాగైనా ఆ సొమ్ముని దొంగలించాలని అనుకుని విషయం ఆమె భర్త విజయ్ కుమార్ చెవిలో వేసింది. స్టేషన్లోని వెండిని దొంగతనం చేసిన తరువాత , ఆ సొమ్ముని ఎవరు గుర్తు పట్టుకోకుండా , మార్పు చేయాలి అనుకుని , ఆమె మరిది భరత్ సింహా కు గోల్డ్ షాప్ ఉన్నందున అతని ద్వారా వెండిని కరిగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత విషయం గతంలో రైటర్ గా ఉన్న రమణ బాబు కి చెప్పి అతన్ని భాగస్వామ్యం చేశారు. ఇంకేముంది ఆ తర్వాత అందరు కలిసి
మే 2022 తేదీన కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయిన ఎక్సైజ్ కేసుల లోని మద్యం బాటిల్లను ధ్వంసం చేసే క్రమంలో అందరూ ఉండగా, వాహనాల్లో లోడ్ చేసి తరలించే క్రమoలో సదరు వెండి వస్తువులను దొంగలిoచడానికి అదే అదునుగా భావించారు. పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వెండి వస్తువులను తీసుకుని అనంతరం సీఐ గదిలో ఉన్న బీరువా లోకి మార్పు చేశారు.
సీఐతో పాటు స్టేషన్లో సిబ్బంది మద్యం బాటిల్ల ద్వంసం చేసేందుకు వాహనాల్లో వెళ్ళగా, మహిళా కానిస్టేబుల్ అమరావతి తన ఇంటికి వెళ్లడం జరిగింది. తిరిగి ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకి సివిల్ డ్రెస్ లో స్టేషన్ కి వచ్చి సెంట్రీ తప్ప ఎవరు లేరని గమనించి సెంట్రీ తో ఐదు నిమిషాలు మాట్లాడి మళ్ళీ వెళ్లిపోవడం జరిగింది.ఆ తరువాత తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మద్యలో భర్త తో పోలీసు స్టేషన్ కాంపౌండ్ లో సీఐ రూమ్ వెనుకకు వచ్చి ముందే తను తెరిచి పెట్టుకున్న గ్రిల్ల్స్ లేని కిటికీ లో భర్త ని లోనికి పంపించి బీరువా లో ఉన్న రెండు బ్యాగ్ లలో ఉన్న వెండిని దొంగలించి అక్కడి నుండి వెళ్ళిపోయారు.
చోరీ సొమ్ముతో దర్జా
తరువాత కాలక్రమేనా ఆ వెండిని తన మరిది భరత్ సహాయంతో వెండి స్వరూపాన్ని మర్చినారు. దాదాపు 23 కేజీల వెండిని నగదుగా మార్చుకున్నారు. వచ్చిన సొమ్ముతో కొత్త కియో కారు, ఓ బంగ్లా కొనుక్కొని.. దర్జా చేస్తూ వచ్చారు.
డొంక కదిలింది ఇలా
ఆ తరువాత తన సొమ్ము కోసం యజమాని , వాణిజ్య పనుల శాఖ వేసిన ఫైన్ కట్టి, రిలీజ్ ఆర్డర్ పొంది , సొమ్ము రిలీజ్ చేసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాడు., ఆ సొమ్ము గురించి వెతకగా కనపడలేదని , సొమ్ము మాయం లో వారి పై అనుమానం పడి కేసు నమోదు చేశారని తెలుసుకుని పరారయ్యే ప్రయత్నంలో ఉన్నారు. అరెస్ట్ చేసి, ఉద్యోగం కూడా తీయిస్తారని అనుకుని, మిగిలిన సొమ్ము తో కర్ణాటక కి పారిపోయి , సొమ్ముని అమ్ముకుని, హై కోర్టు లో బెయిల్ తీసుకుందామని కియో కారులో పారి పోతుండగా అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 10 లక్షల నగదు, 81.52 కేజి ల వెండి ని స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీలు కెవి మహేష్, యుగంధర్ బాబు, సిఐలు రామలింగయ్య, అబ్దుల్ గౌస్, తబ్రేజ్, శ్రీనివాసులు, ఎస్సై మన్మథవిజయ్ తదితరులు పాల్గొన్నారు.