Tuesday, November 19, 2024

AP | కర్నూల్ ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతు కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి

కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ, ఏపీ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా చేప‌ట్టారు. ముందుగా అంబేద్కర్ భవన్ నుండి వందలాదిమంది ఎండిన పంట మొక్కలతో భారీ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. ఈ ర్యాలీలో వినూత్న రీతిలో ఎద్దుల బండిపై రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా చేపట్టారు.

ఖరీఫ్ సీజన్లో వేసిన పత్తి, వేరుశెనగ, కంది, ఆముదం, ఉల్లి, మిర్చి, ఉద్యానవన పంటల విత్తనం వేసిన కాలం నుండే తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మొత్తం ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, రైతులు ఖరీఫ్ సీజన్లో పంట పెట్టుబడి కోసం బ్యాంకుల్లో, కొంతమంది ప్రవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పుచేసి పంట వేయడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడు పంట పూర్తి స్థాయిలో చిల్లి గవ్వ చేతికి రాకపోవడంతో నష్టపోయారన్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు నిరాశలో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర ఆందోళనలో ఉన్నారని, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా కలెక్టర్ గాని, స్థానిక ఎమ్మెల్యేలు గానీ, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.

కర్నూలు జిల్లా ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని ఎంతో ఆదరించి అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపిస్తే గెలిచినవారు పదవులు అనుభవిస్తూ, ధనార్జన ధ్యేయంగా సంపద ఏవిధంగా కూడబెట్టుకోవాలో ఆలోచిస్తున్నారు తప్ప రైతన్న తీవ్ర నష్టాల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఒక్క ప్రజా ప్రతినిధి కూడా నోరు విప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం సిగ్గుచేటు అన్నారు. కర్నూలు జిల్లాలో ఒకేరోజు హెబ్బటం, పి కోటకొండ గ్రామాలలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఒక్క ప్రజా ప్రతినిధి కూడా పంటల పరిశీలన చేయకపోవడం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు.

ఈ మహా ధర్నా నుండి రైతులను ఒకటే కోరుకుంటున్నామని ఏ ఒక్క రైతు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీకు అండగా సిపిఐ,ఏ.పీ.రైతు సంఘాలు అండగా ఉన్నాయని, అందరం కలిసికట్టుగా పోరాడి మన సమస్యలు పట్టించుకోని జిల్లా ప్రజా ప్రతినిధులకే గోరి కడదాము తప్ప దేశానికి అన్నం పెట్టే మనం ఆత్మహత్య చేసుకోవద్దని వారు పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement