Monday, November 18, 2024

Kurnool – చెట్ల పెంపకమే ముందు తరాలకు అందించే గొప్ప ఆస్తి

  • సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడిషనల్ డైరక్టర్ జనరల్ రాజేంద్ర చౌథురి
  • కర్నూలులోని సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కాలేజీలో అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమం
  • కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు.

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – కర్నూలు బ్యూరో – చెట్ల పెంపకమే భవిష్యత్ తరాలకు అందించే గొప్పబహుమతి అని, మొక్కలు నాటి సంరక్షించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడిషనల్ డైరక్టర్ జనరల్ రాజేంద్ర చౌథురి తెలిపారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, క్షేత్ర కార్యాలయం, కర్నూలు ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజీలో అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజేంద్ర చౌథురి, కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.

కర్నూలు ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ హెడ్ డి. మురళి మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణంతో కూడిన భూమిని అందించటం మనందరి బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. పర్యావరణం – ప్రగతిని సమన్వయం చేసుకుని ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమౌతుందని, ఈ దిశగా విద్యార్థులంతా అమ్మ పేరిట ఒక మొక్క స్ఫూర్తిని వ్యాప్తి చేయటంలో భాగస్వాములు కావాలని సూచించారు.

- Advertisement -

దేశంలో అటవీ ప్రాంత విస్తీర్ణం పెంచటంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ఆవశ్యకమన్న ప్రధానమంత్రి మాటలు అక్షర సత్యాలని కార్యక్రమంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కులు నాటడమే కాకుండా, ఆ చాయా చిత్రాన్ని తీసుకుని హ్యాష్ ట్యాగ్ లను వినియోగించి సామాజిక మాథ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. శాంత, సెంట్రల్ బ్యూర్ ఆఫ్ కమ్యూనికేషన్ కార్యాలయ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు కర్నూలులోని ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని సందర్శించిన రాజేంద్ర చౌథురి, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement