Saturday, December 28, 2024

Kurnool, Nandyala: విద్యుత్ ఛార్జీల పెంపు… ఆందోళ‌న బాట‌ప‌ట్టిన వైసీపీ

క‌ర్నూలు : పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ కర్నూల్ నగరంలో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించడంతో పాటు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాలసాని రాంపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఐదేళ్లు విద్యుత్‌ చార్జీలు పెంచమని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ చార్జీలను పెంచార‌న్నారు. తక్షణమే పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సూపర్‌సిక్స్‌ హామీలతో గత ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందిస్తామని చెప్పి మాట తప్పుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు.

సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం రూ.15,485 కోట్ల పన్ను భారాలు మోపడం తగదన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆందోళనలో భాగంగా విద్యుత్‌ శాఖ ఎస్సీ పుల్లారెడ్డికి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అంతకుముందు కర్నూలు నగరంలో స్థానిక ఎస్టీబీసీ కళాశాల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి కేవీఆర్‌ కళాశాల ఎదురుగా ఉన్న విద్యుత్‌ శాఖ కార్యాలయం (పవర్‌ హౌస్‌) వరకు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టి వినతిపత్రం అందజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వైఖరి మారే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్ఎం మోహన్ రెడ్డి అన్నారు. అప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడకుంటే ప్రజలను ఏకం చేసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసిపి జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీల పెనుభారాన్ని తగ్గించండి.. మాజీ ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..
నంద్యాల బ్యూరో, డిసెంబర్ 27 : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 6నెలల వ్యవధిలోనే రెండు సార్లు విద్యుత్ చార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు చార్జీల బాదుడును పెంచిందని, పెంచిన కరెంట్ చార్జీలను కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైసిపి పార్టీ ఆధ్వర్యంలోనంద్యాలలో నిరసన చేపట్టారు. శుక్రవారం వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యర్తలు, విద్యుత్ వినియోగదారులు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణం సాయిబాబ నగర్ ఆర్చ్ నుండి ర్యాలీగా తరలి వచ్చి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్ఈ సుధాకర్ కుమార్ కు పెంచిన చార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానికంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ చార్జీలను పెంచమని మోసపు వాగ్దానాలను గుప్పించారని విమర్శించారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న 6నెలల కాలంలో రెండుసార్లు విద్యుత్ చార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై దాదాపుగా 15485కోట్ల అదనపు భారాన్ని మోపడం దారుణమ‌న్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల బాదుడుపై పోరాటానికి సిద్ధం అయ్యామన్నారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు అనేక సభల్లో జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడని వెటకారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనించార‌ని, అయితే నేడు చంద్రబాబు పెంచిన విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఎద్దేవా చేశారు. అలాగే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా నీకు 15వేలు, నీకు 15వేలు, నీకు 18వేలు, నీకు 18వేలు అంటూ చెప్పిన పథకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాడు చంద్రబాబు నాయుడు వాటిని పగులగొట్టండని పిలుపు నిచ్చారని, నేడేమో స్మార్ట్ మీటర్లను బిగించుకోండని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 200 యూనిట్లు ఉచితంగా పేదలకు ఇస్తామని చెప్పి విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారని గుర్తుకు చేశారు.

ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టిస్తున్న సంపద ఎక్కడికి పోతున్నది, ఎవరి జేబుల్లోకి పోతున్నదో చెప్పాలన్నారు. రైతన్నలకు గిట్టుబాటుధరను కల్పించండని రైతన్నలు రోడ్డునెక్కారని, టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పెన్షన్ల పరిశీలన పేరుతో అనేక పెన్షన్లను తొలగించే ప్రక్రియను చేపడుతున్నారని ఇది సరికాదన్నారు. డ్రైవర్షన్ రాజకీయాలను చేస్తూ ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ మోసపు మాటలను నమ్మరని, ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పి.పి.మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్చార్జిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement