Thursday, October 31, 2024

Kurnool – దోస్త్ మేరా దోస్త్​!.. నంద్యాలలో 33 ఏళ్ల వైరానికి చరమగీతం


ఇక భూమా, ఇరిగెల దోస్తాన
బైరెడ్డి సమన్వయంతో కుదిరిన ఫ్రెండ్ షిప్
ఇక ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు , ప్రతి వ్యూహాలు క్షణ క్షణం మారుతున్నాయి. ఎవరు విరోధులో.. ఎవరు హితులో అర్థం కాని సన్నివేశాలు ప్రత్యక్షమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికార వైసీపీని మట్టి కరిపించాలనే లక్ష్యంతో.. 33 ఏళ్ల వైరానికి తెరదించే రీతిలో పావులు కదిలాయి. అవి ఫలించాయి కూడ. మూడు దశాబ్దాల పగలు, పంతాలు పక్కన పెట్టి భూమా, ఇరిగెల వర్గాలు ఏకమయ్యాయి. ఈ రెండు వర్గాలను ఏక తాటిపైకి తీసుకు రావటానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

దశాబ్దాల పంతాలకు చెక్​

కొత్తగా ఆవిర్భవించిన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 33 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్దులుగా వ్యూహాలు ప్రతివ్యూహాలతో పావులు కదిపారు. రెండు వర్గాలు దాడులు, ప్రతి దాడులకు దిగేవి. 1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీలో భూమా నాగిరెడ్డికి ఇరిగెల రాం పుల్లారెడ్డి వర్గం మద్దతు ప్రకటించింది. తరువాత కాలంలో విడిపోయారు. అప్పటి నుంచి ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడు సార్లు భూమా కుటుంబానికి వ్యతిరేకంగా అసెంబ్లీ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఇరిగెల వర్గం వైసీపీ అభ్యర్ది బిజేంద్రరెడ్డికి మద్దతు ప్రకటించింది. ఆ ఎన్నికల తరువాత ఇరిగెల వర్గం గంగుల వర్గానికి దూరమైంది.

- Advertisement -

కలిశారు ఇలా..!

కొద్ది నెలల క్రితం ఇరిగెల సోదరులు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని భావించారు. తమకు సీటు ఇవ్వాలని పవన్ ను కోరారు. అయితే, కూటమి నిర్ణయంలో భాగంగా ఆళ్లగడ్డ సీటు టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు దక్కింది. దీంతో, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ రెండు వర్గాలను దగ్గర చేసేందుకు పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసంలో భూమా అఖిల ప్రియ, – జనసేన నేత ఇరిగెల రాం పుల్లారెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. త్వరలోనే ఈ రెండు వర్గాలకు చెందిన నేతలు ఆళ్లగడ్డలో ఉమ్మడి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో విజయం దిశగా కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement