కర్నూల్ కేంద్రంగా డ్రగ్ మాఫియా చెలరేగుతోంది. ఇంజనీరింగ్ కళాశాలలను, అమాయకులైన విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఏటా కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తోంది. పోలీసుల కళ్లుగప్పి కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న డ్రగ్ మాఫియా ఆగడాలకు ఎట్టకేలకు కర్నూలు సిసిఎస్ పోలీసులు చెక్ పెట్టారు. డ్రగ్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న కర్నూలు చెందిన ప్రధాన వ్యక్తి తో పాటు, విజయవాడలోని నున్నకు చెందిన మరో ఐదు మందినీ కర్నూల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రగ్ మాఫియాలో ఇంకెంత మంది హస్తం ఉందనే వివరాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. విక్రయదారులు తోపాటు వినియోగించే వ్యక్తుల వివరాలు సైతం సేకరిస్తున్నారు. ఏది ఏమైనా కర్నూల్ కేంద్రంగా డ్రగ్ మాఫియా కార్యకలాపాలు జిల్లాలో ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
కర్నూలులో డ్రగ్స్ విక్రయించే వ్యక్తితో సంబంధాలున్న ఐదుగురు యువకులను మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో మెథాంఫిటమైన్ అనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలుకు చెందిన వ్యక్తి ఆన్‌లైన్‌లో బెంగళూరు నుంచి మెథాంఫిటమైన్‌ను కొనుగోలు చేస్తూ కర్నూలు కేంద్రంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు, యువకులకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో బెజవాడలోనీ నున్న గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఆ వ్యక్తికి ఆన్‌లైన్‌లో పరిచయమై అతని నుంచి భారీగానే సరుకు కొనుగోలు చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం కర్నూలు సీసీఎస్ పోలీసులు డ్రగ్ మాఫియాలో ప్రధాన నిందితుడినీ అనుమానంతో అరెస్ట్ చేశారు. ఆతర్వాత తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసులు తమ విచారణలో మొత్తం చిట్టా విప్పాడు. అందులో నున్నకు చెందిన ఐదుగురు యువకుల పేర్లు, ఫోన్ నంబర్లు ఉన్నాయి.
పోలీసులు ఆ వ్యక్తి నుంచి ఈ యువకులకు ఫోన్ చేయించి సరుకును తీసుకొస్తున్నానని చెప్పించారు. వారు నున్న శివారున ఉన్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులో చినకంచి వద్ద ఒక కారులో ఉంటామని చెప్పారు. దీని ప్రకారం కర్నూలు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస నాయక్ ఆధ్వర్యంలో ఒక టీమ్ విజయవాడకు వచ్చి ట్రాప్ వేసింది. వారు దగ్గరకు రాగానే పోలీసులను గుర్తించిన ముగ్గురు యువకులు అక్కడి నుంచి మామిడితోటల్లోకి పారిపోయారు. యశ్వంత్‌రెడ్డి, ఏకేశ్వరరెడ్డి పోలీసులకు దొరికిపోయారు. కర్నూలులో ఉన్న వ్యక్తికి ఈ ఐదుగురు రిటైలర్లుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
విజయవాడ-నూజివీడు రోడ్డులో ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి. డ్రగ్ మాఫియా ఈ ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని యువకులకు ‘మత్తు’ ఎర వేస్తోంది. కాగా, నున్న గ్రామంలో ఒక వీధిలోనే 50 మంది వరకు మత్తుకు బానిసలైన యువకులు ఉన్నారని తేలింది.
మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి ఇచ్చే మందుల్లో మెథాంఫిటమైన్ డ్రగ్ ఒకటి. ఇతర మందుల మాదిరిగా ఇదిప్పుడు అందుబాటులో లేదు. రోగులకిచ్చే మందుల్లో దీన్ని రాయడం మానేశారు. అయినప్పటికీ దీన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఈ బిళ్ల ఒక విధమైన మత్తునిస్తుంది. డ్రగ్‌కు బానిసలైన వారు ఈ టాబ్లెట్‌ను రెండు రకాలుగా తీసుకుంటారు. కొంతమంది నాలుక కింద పెట్టుకుని చప్పరిస్తారు. మరికొంతమంది నేరుగా మింగేస్తారు. ఇది శరీరంలోకి వెళ్లిన తర్వాత ఐదారు గంటలపాటు పనిచేస్తుంది. వివిధ రకాల వెబ్‌సైట్ల ద్వారా విదేశాల నుంచి మెథాంఫిటమైన్‌ను కొనుగోలు చేస్తున్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి..