చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేత, కుప్పం గంగమ్మ ఆలయం పాలకమండలి మాజీ ఛైర్మన్ పార్థసారధి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు ముందు పార్థసారధి ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తాను గంగమ్మ ఆలయం పాలకమండలి ఛైర్మన్గా రెండేళ్ల పదవి కోసం ఏకంగా రూ.35 లక్షలు ఇచ్చానని చెప్పారు. తాను దీని కోసం అప్పు చేయాల్సి వచ్చిందని.. ఇప్పటికీ వడ్డీ కడుతున్నట్లు తెలిపారు. తాను ఎంతో ఖర్చుపెట్టి, ఎన్నో అవస్థలు పడ్డానని.. కనీసం ఈసారి గంగమ్మ జాతర చేసే అవకాశం ఇవ్వాలని వేడుకున్నా.. తనకు పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులిచ్చే వాళ్లకే పదవులిస్తారని.. పార్టీకోసం కష్టపడేవారికి పదవులేవీ రావన్నారు. రెండేళ్లుగా పదవిలో ఉన్నా కరోనా వల్ల గంగమ్మ జాతర చేయలేకపోయానని అన్నారు. ఈ ఏడాది అవకాశం ఇవ్వాలని అడిగినా అంగీకరించకపోవడం అవమానంగా భావించాను తెలిపారు. ఏడేళ్లుగా పార్టీని వదలకుండా సొంత ఖర్చు పెట్టి తిరిగానని.. అయినా డబ్బులు తీసుకుని పదవులిచ్చారని ఆరోపించారు. డబ్బు పోతే పోయింది.. ఒక ఏడాది జాతర చేసి వదిలేస్తానంటే వినలేదన్నారు. తనకు పదవి రాకపోవడానికి ముగ్గురు కారణమని పార్థసారథి తన సెల్ఫీ వీడియోలో ప్రస్తావించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
కాగా, పార్థసారధి గతంలో కుప్పం పంచాయతీలో మూడుసార్లు వార్డు మెంబర్గా విజయం సాధించారు. కుప్పం వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. పార్థసారధి కుప్పం గంగమ్మ ఆలయం పాలకమండలి ఛైర్మన్గా పనిచేశారు. శుక్రవారం నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం చేయబోతున్న సమయంలోనే ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పదవి దక్కలేదనే మనస్తాపంతో పార్థసారధి ఆత్మహత్య చేసుకున్నారు. సెల్ఫీ వీడియోలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
Flash: డబ్బులిచ్చే వాళ్లకే పదవులిస్తారు: సెల్ఫీ వీడియోలో వైసీపీ నేత పార్థసారధి ఆరోపణ
Advertisement
తాజా వార్తలు
Advertisement