గుంటూరు – టీడీపీ కేంద్ర కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు 3నెలల విరామం తర్వాత మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టేందుకు, తెలుగు దేశం పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదరక బెదరక నిలిచిన పార్టీ నేతలు, కార్యకర్తలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానన్నారు మాట్లాడుతూ ,ప్రభుత్వ అక్రమ అరెస్టులకు తాను భయపడనని, పార్టీ శ్రేణులు కూడా మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు.
అధినేత కోసం ఎన్ని కేసులు, ఇబ్బందులు అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు చంద్రబాబుకు తెలిపారు. నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ, ఓటర్ల జాబితా పరిశీలన వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను నేతలు చంద్రబాబుకు వివరించారు.
సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పీఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో పలువురు కుప్పం వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు