కుప్పం, (ప్రభ న్యూస్ ): రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎనిమిదవ సారి కుప్పం నుండి పోటీ చేయనున్నడం తో ఆయన తరుపున సతీమణి భువనేశ్వరి శుక్రవారం నాడు నామినేషన్ దాఖాలు చేశారు. ఈ సందర్బంగా భారీ ర్యాలీ నిర్వహించి కుప్పం బస్టాండ్ కూడలిలో టిడిపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ
కుప్పంలో పసుపు జెండా తప్ప మరో జెండాకు చోటులేదన్నారు.
చంద్రబాబు ను అరెస్టు చేసినప్పుడు నేను నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేశానని ఈ కార్యక్రమం ద్వారా నా పార్టీ బిడ్డల కుటుంబాలను నేరుగా కలవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నిజం గెలవాలి కార్యక్రమం సమయంలో పార్టీ బిడ్డలే నాకు అండగా నిలిచారని అన్నారు. అదేవిధంగా నేడు కుప్పంలో అంతకు మించి అన్నట్టు మీ ఉత్సాహం, ఆనందం చూస్తుంటే లక్ష మెజార్టీ ఖాయం అనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు భువనేశ్వరి.
నామినేషన్ కు బయలుదేరినప్పుడు యువత, నిరుద్యోగులు,మహిళలు, వికలాంగులు, రైతులు వచ్చి నామినేషన్ ఫీజు ఇచ్చారని తెలిపారు. వారు ఇచ్చిన డబ్బులతోనే నామినేషన్ వేశానన్నారు. చంద్రబాబు ఏపీ ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని చూశారని, వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీ నేతల దోపిడీకి అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపేశారని,వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు.రాష్ట్రంలో ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటేనాని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైసీపీ పాలనలో నలిగిపోయారని తెలిపారు. వైసీపీ దుర్మార్గపు పాలనను రానున్న ఎన్నికల్లో ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు సీఎం అయితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు జెండాలు వేరైనా అజెండాలు ఒక్కటే అని , ఈ ఎన్నికలలో కూటమి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె తెలిపారు.