అమరావతి – ఎపీలో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం ఆందోళనలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి గత ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీల్ని గుర్తుచేస్తూ వాటిని అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఉద్యోగ సంఘం నేతపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలున్నా ఆయన్ను ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలకు కూడా అహ్వానించడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో పాటు వాణిజ్య పన్నుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్న కేఆర్ సూర్యనారాయణకు ఇవాళ మరోసారి హైకోర్టులో ఊరట లభించింది. వాణిజ్య పన్నుల శాఖలో బదిలీల విషయంలో నిరసనలకు దిగి అసిస్టెంట్ కమిషనర్ ను నిర్బంధించారనే అంశంపై ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులను హైకోర్టు రద్దు చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది
కాగా,గతంలో గవర్నర్ గా ఉన్న హరిచందన్ ను ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీత భత్యాల బకాయిలు ఇప్పించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆయనపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఆ తర్వాత ఆయనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుల్ని హైకోర్టు రద్దు చేసింది.ప్రభుత్వం ఉద్యోగసంఘాలతో జరిపే చర్చల్లో సూర్యనారాయణకు ఆహ్వానం ఇవ్వకపోవడంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ మరోసారి హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేయడంతో కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వం పైచేయి సాధించినట్లయింది