- ఆరు నెలలుగా ఎక్కడ సమస్యలు అక్కడే…
- శంకుస్థాపనలకే పరిమితం కావడం దారుణం…
- స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామా…
- ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించండి…
- ప్రజల పక్షాన నిరంతర పోరాటం…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, కేవలం శంకుస్థాపనలకే పరిమితమైతే సమస్యలు ఎవరు తీరుస్తారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ వ్యతిరేకించి, ఇప్పుడు వాటిని మళ్లీ అమల్లోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యతో పాటు అన్ని సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు.
గుణదలలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో విజయవాడలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ కూటమి నేతలు ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదన్నారు. వైసీపీ హయాంలో కార్పొరేషన్ లో సెంక్షన్ అయిన పనులు వద్ద శంకుస్థాపనలు చేస్తూ కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ఇది శంకుస్థాపనల ప్రభుత్వమే కాని ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదన్నారు. వైసిపి హయాంలో ప్రారంభించి చివరి దశలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
స్మార్ట్ మీటర్ల పేరుతో మరో డ్రామాకు తెరలేపారని, వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పై కూటమి నేతలు నిందలు వేశారని, దానికి ఇప్పుడు ఏ సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రచారం చేసుకోని అధికారంలోకి వచ్చారని, ఆ పథకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజాయితీ నిరూపించుకోవాలని హితవు పలికారు.
లయోలా కాలేజీ వాకర్స్ కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పెద్దపెద్ద హామీలు ఇచ్చారని, వాళ్లని రెచ్చగొట్టి ఇప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు. లయోలా కాలేజ్ యాజమాన్యానికి వాకర్స్ ని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చెల్లారావు, కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మలా కుమారి, వియ్యపు ఆమర్నాధ్, తంగిరాల రామిరెడ్డి, తాటిపార్తి కొండారెడ్డి పాల్గొన్నారు.