పూర్ణాహుతితో పరిసమాప్తం
తొమ్మిది రోజులపాటు వైభవంగా పూజలు
పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : గడిచిన తొమ్మిది రోజులుగా అత్యంత వైభవంగా సాంప్రదాయపద్ధంగా జరిగిన వారాహి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన పూర్ణాహుతితో వారాహి నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. జూన్ 6వ తేదీ నుండి ప్రారంభమైన వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం రుద్ర హోమం జరుగు యాగశాలలో ఆలయ కార్యనిర్వాహనాధికారి కేఎస్ రామారావు సమక్షంలో స్థానాచార్యులు వైదిక సిబ్బందిచే వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణహుతి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రి ఉత్సవములు దిగ్విజయంగా పూర్తయ్యాయని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. తొమ్మిది రోజులపాటు జరిగిన వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వారాహి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, సహాయ కార్యనిర్వాహనాధికారి ఎన్ రమేష్, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.