కంచికచర్ల – ప్రభా న్యూస్ – నిర్లక్ష్యంగా వదిలేసిన నీటి గుంతలు ఇద్దరి ప్రాణాలను హరించాయి. యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, అక్రమ క్వారీల కారణంగా ఏర్పడిన భారీ గుంతలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తెలిసి తెలియక అటువైపు వెళ్లి కాలుజారి మృత్యువాత పడుతున్న సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటన కంచికచర్ల మండలం దొనబండ క్వారీ వద్ద చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు.
ఒడిశా రాష్ట్రానికి చెందిన లివాన్ లక్ష్మీ జానీ (15 ), జానీ రాధ (14) కేఎంసీ క్వారీ వద్ద బట్టలు ఉతికేందుకు బుధవారం ఉదయం వెళ్లారు. ప్రమాదవశాత్తు వారు కాలుజారి అందుపడి మృతి చెందారు. లక్ష్మీ ప్రస్తుతం దొనబండ లో పదవ తరగతి , రాధ 9వ తరగతి చదువుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్గానికి తరలించారు.