విజయవాడ, (ఆంధ్రప్రభ) : విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక ప్రదర్శనను గురువారం మహోజ్వల ఘట్టంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటులు పవన్ కళ్యాణ్ ఎంతో ఆసక్తిదాయక ప్రసంగంతో వేలమంది పుస్తక ప్రియుల్ని ఆకట్టుకోవడం విశేషం.
ఈనాడు సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పుస్తక ప్రదర్శన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు తదితరులు ప్రసంగించిన ఈ బుక్ ఫెస్టివల్‌లో సుమారు 270 బుక్‌స్టాల్స్ నెలకొల్పారు. మొదటిరోజు ఆధ్యాత్మిక పుస్తకాలే ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం.
హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో టాక్ ఆఫ్ ది బుక్ ఫెయిర్‌గా కీర్తి పతాకాన్ని ఎగుర వేసిన తిరుమల శ్రీవేంకటేశ్వరుని అపురూప వర్ణమయ అద్భుత గ్రంథం అదివో.. అల్లదివో విజయవాడ పుస్తక ప్రదర్శనలోనూ హవా కొనసాగించడం ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ప్రతిభకు, భక్తి సౌందర్యానికి పరాకాష్టగా నిలిచింది.
మొదటిరోజు స్టాల్స్ ముగిసే సమయానికి సుమారు 200కు పైచిలుకు పాఠకులు ఈ గ్రంథానికి పట్టం కట్టడం విశేషం. యుగే యుగే, నన్నేలు నాస్వామి, శ్రీపూర్ణిమ, శ్రీమాలిక, అమ్మణ్ణి, శరణు.. శరణు వంటి అనేక విలక్షణ గ్రంథాలతో లక్షణ పాఠకుల్ని సొగసైన సౌందర్య వంతమైన పవిత్రభాషతో ఆకట్టుకున్న పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత రచనా సంకలనం అదివో.. అల్లదివో గ్రంథం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో కూడా వేలకొలది బుక్స్ అమ్ముడుపోయి పాఠక శీర్షికలకెక్కడం ఒక ప్రత్యేక విశేషంగా పుస్తక విక్రేతలు పేర్కొంటున్నారు.
గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులెందరో పురాణపండ అద్భుత గ్రంథాలను ఆవిష్కరించిన ఘట్టాలు ఇలాంటి రమణీయ కమనీయ గ్రంథాలు దర్శనమిచ్చినప్పుడు గుర్తుకొస్తాయని ఒక పుస్తక విక్రేత బహిరంగంగానే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్.ను అభినందించడం తొలిరోజు పుస్తక ప్రదర్శన విశేషంగా చెప్పక తప్పదు.