Friday, November 22, 2024

AP: గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలించిన కలెక్టర్

మచిలీపట్నం జులై 22(ప్రభ న్యూస్): రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పర్యటనను పురస్కరించుకొని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రక్కనే ప్రోక్లైన్ తో జరుగుతున్న మట్టి చదును పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతులతో ముఖాముఖి సభా ప్రాంగణం, ఛాయాచిత్ర ప్రదర్శనశాలల ఏర్పాటు పక్కాగా చేయాలన్నారు.

రైతు భరోసా కేంద్రానికి వచ్చే మార్గంలో గుంతలుగా ఉన్న రహదారిని బాగు చేయాలన్నారు. సమయం చాలా తక్కువ ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. గవర్నర్ పర్యటన సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిరంతర విద్యుత్తు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జనరేటర్ ను ప్రత్యామ్నాయంగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఉయ్యూరు ఆర్డీఓ విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, డి ఎల్ డి ఓ నాంచారావు, తహసిల్దారు శివయ్య, ఎంపీడీవో సునీత శర్మ, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement