Friday, November 22, 2024

ఇకపై పశువులకు ప్రత్యేక అంబులెన్సులు …

175 శాసనసభ నియోజకవర్గాలకు ఒక్కో వాహనం
రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో పశువైద్యుడు
6,099 పశు సంవర్ధక అసిస్టెంట్ల ఖాళీల భర్తీకీ ముఖ్యమంత్రి ఆమోదం

మ‌చిలీప‌ట్నం – మనుషులకు అత్యవసర సేవలు అందాలంటే..108కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వ అంబులెన్స్‌ కుయ్‌..కుయ్‌మంటూ వస్తుంది. అదే తరహాలో పశువులకు సత్వర వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ఫోన్‌ చేస్తే ఇకపై సంచార వైద్యశాల గ్రామాలకు రానుంది. అందులోని పశువైద్యసిబ్బంది పశువులు, గొర్రెలు, మేకలకు చికిత్స చేసి, రైతులు, పెంపకందారులకు మందులు ఇచ్చి వెళతారు. ఈ సంచార వైద్యశాల(అంబులెన్స్‌) వాహనాలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలకు చేరనున్నాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు మైరుగైన వైద్యం అందించడమే వీటి లక్ష్యం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 వాహనాలు రానున్నాయి. సోమవారం తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు. 6,099 పశు సంవర్ధక అసిస్టెంట్ల ఖాళీల భర్తీకీ సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలలో ఇకపై పశువైద్యుడుఅందుబాటులో ఉండాలని సూచించారు. కియోస్క్‌ ద్వారా పశువుల దాణా, మందులు ఇవ్వాలన్నారు. సీడ్, ఫీడ్, మెడికేషన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, నాసిరకం వాడకూడదని, కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు ‌పాటించాలని ఆదేశించారు. పశువుల అంబులెన్స్‌ సంచార వైద్యసేవలపై రైతుల్లో ఆసక్తి నెలకొల్పేల చర్యలు తీసుకోవాలని కోరారు.
పశు సంచార వైద్యానికి కొత్తగా వాహనాలను కేటాయించడంపై పాడిరైతులలో ఎంతో సంతోషం నెలకొననుంది. గ్రామ గ్రామాన పశువైద్యానికి అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. రైతులు ఫోన్‌ చేయగానే వారి ఊరికి పోయి..పశువైద్య సిబ్బంది మూగ జీవాలకు చికిత్స అందిస్తారు. పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చే స్థితిలో లేని వారికి ఇది ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా పశువైద్యసేవలు అందనున్నాయి. పశువుల వద్దకే వైద్యం రావడం మంచి పరిణామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement