(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసంలో మొదటి సోమవారం శివనామస్మరణ జిల్లా వ్యాప్తంగా మార్మోగుతోంది. తొలి సోమవారాన్ని పురస్కరించుకొని కృష్ణానది తీరాన భక్తులు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుండే పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇప్పటికే శైవక్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుండే శైవ క్షేత్రాల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావించే ఈ కార్తీకమాసంలో పెద్ద ఎత్తున శివాలయాలకు తరలివచ్చే భక్తుల కోసం ఆయా దేవాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుణ్యస్నానాలు నదీ స్నానాల అనంతరం భక్తులు కార్తీక దీపాలను పలు ప్రాంతాల్లో వెలిగించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడడంతో పాటు ఆధ్యాత్మిక, కార్తీక శోభ ప్రత్యేకంగా సంచరించుకుంది.
ఇంద్రకీలాద్రి దిగువ ఉన్న పవిత్ర దుర్గ ఘాట్ లోని పవిత్ర కృష్ణా నదిలో భక్తులందరూ పవిత్ర స్నానమాచరించుటకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో పవిత్ర దుర్గా ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, పవిత్ర స్నానములకు భక్తులకు అవకాశం కల్పించారు. భక్తులు విశేషంగా దుర్గా ఘాట్ వద్ద పవిత్ర కృష్ణానదీలో స్నానమాచరిస్తున్నారు. దుర్గా ఘాట్ లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆలయ వైదిక కమిటీ సభ్యులు మారుతీ యజ్ఞ నారాయణ, కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.