Monday, November 11, 2024

AP: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి.. కలెక్టర్ డా.జి.సృజన

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని, గంజాయి మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ జి.సృజన సంబందిత అధికారులు, స్వచ్చంద సంస్థలకు సూచించారు. నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలపై మంగళవారం విజయవాడలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌ బాబు వివిధ శాఖల అధికారులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ జి. సృజన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.

గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు 100రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను సేవించే ప్రదేశాలపై ఆకస్మిక దాడులు, మాదకద్రవ్యాలను సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలు వినియోగం వలన ఎదురయ్యే దుష్ఫలితాలు గురించి విసృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలలో యాంటి నార్కోటిక్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డి`ఎడిక్షన్‌ సెంటర్‌ పనితీరును మరింత మెరుగు పరిచి సైకాలజిస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాలను సరఫరా చేసే పెడ్లర్స్‌ ను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసేందుకు వెనకాడవదన్నారు. వ్యవసాయ క్షేత్రాలలో గంజాయి సాగు చేయకుండా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ, విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, మండల స్థాయిలో బృందాలుగా ఏర్పడి గ్రామాలలోని పాఠశాలు కళాశాలల పరిసరాలలో బడ్డీ కొట్లు, దుకాణాలను ఆకస్మికంగా తనిఖి చేసి గంజాయి, మాదక ద్రవ్యాలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ జిల్లాను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్ధేందుకు ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమన్నారు.

- Advertisement -

నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ… జిల్లాలో గంజాయి మత్తు పద్దార్థలను సేవించే 136 హట్‌స్పాట్‌లను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాల్లో సరైన విద్యుత్‌ సౌకర్యం లేక చీకటి ప్రదేశంగా ఉండడం కారణంగా అసాంఫీుక కార్యకలాపాలు సాగించేందుకు అనువుగా ఉన్నాయన్నారు. అటువంటి ప్రదేశాలలో ముళ్ళపొందలు, గుబురు మొక్కలు, చెట్లను తొలగించి విద్యుత్‌ సౌకర్యం మెరుగు పరచడంతో పాటు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కమీషనరేట్‌ పరిధిలో 1900 సిసి కెమెరాలు ఏర్పాటు చేయగా వీటిలో 1300 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. సిసి కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవసరమైన విద్యుత్‌, ఇంటర్‌ నెట్‌ కనెక్షన్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

పాఠశాలలు కళాశాలతో పాటు సినిమా దియేటర్లు, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లలో ప్రసార మాద్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, కళాజాతాల ద్వారా గ్రామాలలో సాంసృతిక ప్రదర్శనలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో డిసిపిలు గౌతమి శాలి, కె.యం మహేశ్వరావు, కె. చక్రవర్తి, ఎసిపి కె. వెంకటేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి వి. శ్రీనివాసరావు, విజయవాడ, తిరువూరు, నందిగామ ఆర్‌డివోలు బి.హెచ్‌ భవానిశంకర్‌, కె. మాధవి, ఎ. రవీంద్రరావు, నగర పాలక సంస్థ అడిషనల్‌ కమీషనర్‌ కె. మహేష్‌, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి. వి. కామరాజు, డిఇవో యు వి. సుబ్బారావు, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, జిల్లా క్షయ నివారణ అధికారి డా. జె. ఉషరాణి, ఎక్సైజ్‌ డిపిఇవో బి. శ్రీనాదుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కె. నాగమణెమ్మ, ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్‌, డి`ఎడిక్షన్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. స్వరాజ్యలక్ష్మి, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఎస్‌ఎల్‌రాజు, ఆరవ రమేష్‌, డా.శంకర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement