Saturday, November 23, 2024

ఋణాలు అందిస్తేనే బ్యాంకులకు సార్థకత చేకూరుతుంది – ఎంపి వల్లభనేని బాలశౌరి

చినగొల్లపాలెం( కృష్ణాజిల్లా): అర్హులైన వారికి ఋణాలు అందిస్తేనే బ్యాంకులకు సార్థకత చేకూరుతుందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, చైర్మన్-సబార్డినట్ లెజిస్లేషన్ కమిటీ (లోక్ సభ) వల్లభనేని బాలశౌరి అన్నారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలం, చినగొల్లపాలెం గ్రామంలో నిర్మించిన కెనరా బ్యాంకు నూతన శాఖతో పాటు ఏటీఎమ్ లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ పి.జాషువా, కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓ కే.సత్యనారాయణరాజు లతో కలసి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ సభలో మాట్లాడుతూ ఎక్కడైతే బ్యాంకు ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా పది వేల కోట్ల లాభాలతో ముందుకెళ్తున్న కెనరా బ్యాంకు, అభ్యర్థన మేరకు చినగొల్లపాలెంలో తమ 638వ నూతన శాఖను ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ ఎండి, సీఈవో కృషి అభినందనీయమని కొనియాడారు. ఏ వ్యాపారవేత్త అయినా అభివృద్ధి చెందారంటే అది బ్యాంకుల సహకారమేనని, ఈ పరిసర ప్రాంతంలో వ్యాపారం చేసుకునే వారికి కెనరా బ్యాంకు తన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య బ్యాంకును స్థాపించి లక్షల మందికి ఉద్యోగాలను కల్పించి వ్యాపారవేత్తల అభివృద్ధికి కృషి చేశారని, దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసి సమాజ ఆర్థిక అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ది మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తున్నారని, నగదును తీసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మీ గ్రామంలోనే ఉన్న బ్యాంకు నుండి వెంటనే తీసుకోవచ్చని అన్నారు. విదేశాల నుంచి బంధువులు పంపే నగదును సైతం బ్యాంకు ద్వారా సులువుగా పొందచ్చని చెప్పారు. ఖాతాదారులు, బ్యాంకుల మధ్య సత్సంబంధాలు ఉండాలని చెప్తూ నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ముద్రా రుణాలు, పీఎంఈజీ సబ్సిడీ రుణాలను అందించాలని బ్యాంక్ అధికారులను కోరారు. గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.25 లక్షలు, సీఎస్ఐఆర్ ఫండ్స్ నుంచి రూ.కోటి నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గ్రామ రాకపోకల నిమిత్తం ముఖ్యమైన రెండు వంతెనలను నిర్మించి గ్రామ అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. గ్రామంలో బ్యాంకు ఏర్పాటు వల్ల గ్రామస్తులందరూ బ్యాంకు లావాదేవీలన్నీ బయటికి వెళ్లకుండా గ్రామంలోనే నిర్వహించుకోవచ్చన్నారు. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు గ్రామానికి క్యూ కడతాయని చెప్పారు. ఆల్ ఇండియా సివిల్స్ టాప్ ర్యాంకర్ రేవు ముత్యాలరాజు, కెనరా బ్యాంక్ ఎండి సీఈవో ఇద్దరూ రెండు ఆణిముత్యాలని, ఇది మనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామంలో బ్యాంకును ఏర్పాటుకు, మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి అభినందించారు.

ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి జోగి రమేష్, బ్యాంక్ ఎండి, సీఈవో సత్యనారాయణరాజు కృషి వల్లే గ్రామంలో బ్యాంక్ ఏర్పాటుకు కారణమని అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయని భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యోగ కల్పన జరగనున్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రుల ముందు సభలో మాట్లాడటం తనకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు.

- Advertisement -

బ్యాంకు ఎండి, సీఈవో మాట్లాడుతూ కేవలం డొనేషన్లు, స్కీములు వల్ల మాత్రమే అభివృద్ధి జరగదని బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని, ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చే లక్ష్యంగా బ్యాంకులు పనిచేస్తాయని అన్నారు. మహిళలకు ఆర్థిక స్వతంత్రం అవసరమని, వారి ఆర్థిక అభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు దోహదం చేస్తాయని అన్నారు. బ్యాంకు అందించే సహకారంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, మరింతమంది ఆల్ ఇండియా సివిల్స్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి ఆణిముత్యాలను తయారు చేయాలని గ్రామస్తులను కోరారు.

కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి రాకపోకల కష్టం దశ నుంచి ఒక బ్యాంకును ఏర్పాటు చేసే దశ వరకు గ్రామం ఎదిగిందని, రానున్న కాలంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. పొదుపు వల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుందని చెప్పారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో బ్యాంకును ఏర్పాటు చేసి, సేవలను అందిస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం బ్యాంకు అధికారుల కృషి అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ సర్కిల్ కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ కే.కల్యాణి, డీజీఎం విజయలక్ష్మి, బందరు ఆర్డీవో ఐ కిషోర్, జెడ్పీటీసీ మైలా రత్నకుమారి, ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్, గ్రామ సర్పంచి పెనుమాల సునీల్ ఎంపిడిఓ పిచ్చిబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, బ్యాంకు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement