Friday, November 22, 2024

ప్రజలను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మీపై ఉంది !! — మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం : ఇంటింటికి వెళ్లి ఏ విధంగా ఓట్లను అభ్యర్ధించారో అదే మాదిరిగా ఇపుడూ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకొని వారికి కరోనాపై అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు చెప్పి వారిని సంరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందని రాష్ట్ర రవాణా, సమాచార , పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కార్పొరేటర్లకు సూచించారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత జరిగిన మొదటి నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగింది. గురువారం స్థానిక మునిసిపల్ ప్రధాన పార్కులోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించబడింది. ఈ కౌన్సిల్ సమావేశంకు ముఖ్య అతిధిగా మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక బాధ్యత కల్గిన ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మీరు ప్రజల యోగ క్షేమాలు, ఆరోగ్య సమాచారం తెల్సుకొని ప్రజలను కాపాడుకోవాల్సిన దర్మం కనీసం అలవర్చుకోవాలని సూచించారు. కరోనా వ్యాధిని ప్రబలకుండా నివారించడమే మన ముందున్న ఏకైక పరిష్కారమని, ఏదైనా ప్రాణం మీదకు వస్తే మినహా ఏ ఒక్కరు ఇంటి నుంచి ప్రస్తుత పరిస్థితులలో మరో నెలన్నర రోజులు రాకూడదని ప్రజలను అభ్యర్ధించాలని సూచించారు. 2 లక్షల జనాభా ఉన్న మచిలీపట్నంలో కరోనా వ్యాధి నానాటికి రెట్టింపు అయిపోతుంటే, ఎన్ని ఆక్సిజన్ పడకలు ఉంటే సరిపోతుందో ఒక్కసారి ప్రజలు యోచించాలని మంత్రి కోరారు. వీరందరికి డాక్టర్లు , నర్సులు ఇతర వైద్య సిబ్బంది ఎక్కడఎం లభ్యమవుతారని ప్రశ్నించారు. ఈనాటికి ఒక్కరోజు సెలవు లేకుండా రోజుకు 8 నుంచి 10 గంటలు నిర్విరామంగా వైద్యసిబ్బంది తమ విలువైన సేవలు అందిస్తున్నారని, అలాగే వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు నిర్వహించి డాకర్లు , నర్సులు,ఏ ఎన్ ఎం , జి ఎన్ ఎంలు , బి ఎస్సి నర్సింగ్ చదువుకొన్నవారికి ఉద్యోగాలు ఇచ్చి ఆయా కోవిడ్ కేర్ సెంటర్ లలో నియామకం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆపదలో ఉన్న తమ తోటి మనిషిని బ్రతికించాలని ఉద్దేశ్యంతో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఎక్కడ కనబడితే అక్కడ ఆక్సిజన్ పైప్ లాగి 450 పడకలు పెంచామని, అయినప్పటికీ కరోనా రోగుల తాకిడి పెరగడంతో స్థానిక లేడీ యాంప్తిల్, నోబుల్ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుచేసి మరో 100 పడకలు సిద్ధం చేసేమని మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో అప్పో సప్పో చేసి ప్రాణాలు నిలుపుకోవాలని నెలకు సరిపడా నిత్యావసర సరుకులు తెచ్చుకొని జూన్ 30 వ తేదీ వరకు అందరూ ఇంటికే పరిమితమై ప్రజలు ఉండేలా కార్పొరేటర్లు ప్రజలను అభ్యర్ధించాలని మంత్రి పేర్ని నాని కోరారు. రాష్ట్రంలో రోజుకు 20 వేలమంది ప్రజలకు కరోనా వైరస్ సోకుతున్నట్లు గణాంకాలువెల్లడి చేస్తున్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. విద్యాధికులైన వారు సైతం స్థానిక మెడికల్ దుకాణాల నిర్వాహకులు, కంపౌండర్లతో కరోనా తూ తూ మంత్రపు చికిత్స చేయించుకోవడం ఎంత మాత్రం సరికాదన్నారు. కరోనా పాజిటివ్ వచ్చినవారు తక్షణమే ప్రభుత్వాసుపత్రికి రావాలని, 3 వ రోజు లేదా 5 వ రోజు రక్త పరీక్ష చేయించుకొని సి ఆర్ పి లెవెలు పరిశీలింప చేసుకోవాలని,సి ఆర్ పి లెవెల్స్ పెరుగుతుంటే , మరో మరో నాలుగైదు రోజుల్లో ఊపిరితిత్తుల సమస్య ఎదురుకానున్నట్లు ఒక సంకేతమని అలాగే డిడైమెర్స్ పెరుగుతుంటే కనుక రక్తంలో గడ్డ కట్టే గుణం వేగంగా ప్రారంభమవుతుందని అర్ధం తర్వాత మెదడు , గుండె , కిడ్నీ పనిచేయక చనిపోయే ప్రమాదం ఏర్పడుతుందని ప్రజలకు వెంటనే తెలియచేయాలని మంత్రి పేర్ని నాని కోరారు. అలాగే రెమిడీసీర్ ఇంజక్షన్ క‌రోనా సోకిన వారు రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌పైనే ఆశ‌లు పెంచు కుంటున్నారని వాస్త‌వానికి రెమిడిసివ‌ర్ ఒక్క‌టే క‌రోనాను త‌గ్గించే మందు అనే దోర‌ణి అందరిలో ప‌డింద‌ని, ఇది ఒక్క‌టే ప్ర‌త్యామ్నాయం కాద‌ని మంత్రి అన్నారు. కరోనా బాగా ముదిరిన త‌ర్వాత చివ‌రి స్టేజీలో రెమిడిసివ‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని, క‌రోనా సోకిన వ్య‌క్తి మొద‌టి ద‌శ‌లో ఉన్న‌ప్పుడు ఈ రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ తీసుకుంటే ఉప‌యోగం ఉంటుందంటున్నారు. వైర‌స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన‌ప్పుడు దాని ప్ర‌భావం ఎక్కువుగా చూపించ‌కుండా త‌గ్గించ‌డానికి మాత్ర‌మే ఈ రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. క‌రోనా సోకిన వ్య‌క్తికి 5 రోజుల నుంచి 8 రోజుల మ‌ధ్య‌లో ఈ ఇంజ‌క్ష‌న్ ఇస్తే వైర‌స్ తీవ్ర‌త త‌గ్గుతుంద‌ని డాక్ట‌ర్లు తెలియజేస్తున్నారని మంత్రి వివరించారు. . ప్ర‌స్తుతం రెమిడిసివ‌ర్ ఒక్క‌టే క‌రోనాను త‌గ్గించే మందు కాద‌ని, దీనికి ప్ర‌త్య‌మ్నాయంగా వేరే డ్ర‌గ్స్ కూడా ఉన్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. నామినేషన్ వేసిన నాటి నుండి కార్పొరేటర్ గా గెలిచేవరకు ఎంత ఉత్సాహంగా ఆప్యాయంగా ప్రజల బాగోగులు పట్టించుకొన్నారో అదే మాదిరిగా ప్రజలను ఆదుకోవాలన్నారు. ప్రస్తుతం వారు ఆదాయం లేక అనారోగ్యం తదితర కష్టాలలో వున్నారని ఆ సంగతి గుర్తించి వారికి వెంటనే సహాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని కోరారు. ఇటీవల కాలంలో మరణించిన మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, మాజీ కౌన్సిలర్లు కర్రీ త్రిపుర సుందరరావు , చిలంకుర్తి జగన్మోహనరావు , మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ , మాజీ కౌన్సిలర్ మోకా భాస్కరరావు, తాజాగా కార్పొరేటర్ గా ఎన్నికైన చింతా గిరి , 1987 – 1992 మధ్య కాలంలో కౌన్సిలర్ గా పనిచేసిన గోవాడ వెంకటేశ్వరావుల ఆకస్మిక మృతి పట్ల కౌన్సిల తీవ్ర సంతాప వ్యక్తం చేయగా మంత్రి పేర్ని నాని వారి వారి సేవలను గుర్తు చేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సబ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ సమావేశం లో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమీషనర్ శివరామకృష్ణ , డిప్యూటీ కమిషనర్ అనూషా, మునిసిపల్ ఎం ఇ త్రినాధ్ రావు , ఏసిపి నాగశాస్త్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement