Wednesday, January 29, 2025

Kraishna | రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. దేవినేని అవినాష్

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : తెగులు సోకి పంట నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. క్వింటాకు రూ.20వేలు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు, పంట నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో ఆరుగాలం పండించిన రైతు మిర్చి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని, తెగులు సోకిన మిర్చి పంటకి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పంట పొలాలను జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, వైసీపీ నేతలు శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ… గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 49,500 రూపాయలు నష్టపరిహారం అందించిందని గుర్తుచేశారు. ఈరోజు రైతుల్ని ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకునే దాఖలాలు లేవన్నారు. ఒకపక్క రైతుకి ఇంతవరకి ఆరు మాసాలవుతున్నా పెట్టుబడి సహాయం అందలేదని, మరో పక్కన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదన్నారు. వైసీపీ విజ్ఞప్తి చేసేది ఒకటేనని, రైతుల్ని ఆదుకోవాలి, పంటకి కనీస గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ… మిర్చి పంటకి గిట్టుబాటు ధర లేక రైతుకి పెనుభారం అవుతుందని, ఎరువుల రేటు, కౌలు రైతులకు కౌలు భారం పెరిగిందన్నారు. రైతుకి అండగా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలిపారు. రైతుకు న్యాయం చేయలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులని తప్పనిసరిగా పట్టించుకోవాలని, సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. జ‌గ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మిర్చి పంటకు క్వింటాకు 20వేల రూపాయలు మద్దతు ధర మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మిర్చి ఎగుమతులు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మిర్చి పంటల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జిల్లాలో గతంలో సుమారు 55వేల ఎకరాల మిర్చి పంట వేశారు. ఈ సంవత్సరం సుమారు 35000 ఎకరాలు మిర్చి పంట వేశారని, ఆర్ బి కే, పిఎసిఎస్ ద్వారా యూరియా సరఫరా అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకొని, బ్లాక్ మార్కెట్ ని అరికట్టాలన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement