Friday, November 22, 2024

క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి గుడిలో రోజుకి రూ.ల‌క్ష దోపిడీ..

అమరావతి, ఆంధ్రప్రభ: అడ్డగోలు దోపిడీకి ఆలయ ఉద్యోగులు తెగ బడుతున్నారు. ఉన్నతాధికారుల అండదండలు..రాజకీయ నేతల దన్నుతో ఆలయాలకు చేరాల్సిన భక్తుల సొమ్ము కొల్లగొడుతున్నారు. సేవా టిక్కెట్లు మొదలు ప్రసాదాల విక్రయాల వరకు ఉద్యోగుల అవినీతికి అంతే లేకుండా పోతోంది. ఇటీవల పేరొందిన ఆలయాల్లో ఉద్యోగుల అవినీతిని స్వయంగా భక్తులే పట్టుకొని నిలదీయడం జరుగుతోంది. భక్తుల ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వస్తే ఉన్నతా ధికారులు రంగంలోకి దిగి నెపం కంప్యూటర్‌పై నెట్టి చేతులు దులుపు కుంటున్నారు. లేదంటే విచారణ పేరిట భక్తులను ఏమార్చుతున్నారు. భక్తుల ఆగ్రహానికి అప్పటికప్పుడు అడ్డుకట్ట వేసేందుకు విచారణ పేరిట కంటితుడుపు చర్యలు చేపట్టడం మినహా కట్టడికి ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమేనని చెప్పొచ్చు. ఇందుకు విచారణకు కాల పరిమితి విధించకపోవడమే నిదర్శనంగా చెప్పొచ్చు. ‘తిలా పాపం-తలా పిడికెడు’ చందంగా దోపిడీ సాగుతుండటంతో పాలక మండళ్లు సైతం నోరు మెదపడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివార్ల దేవస్థానం, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం సహా పలు ఆలయాల్లో భక్తుల సొమ్ము పక్కదారి పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తుండగా..రాని ఘటనలు అనేకం ఉన్నట్లు భక్తులు చెపుతున్నారు.

రోజుకు రూ.లక్ష పైనే..
రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయమైన విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో ఉద్యోగుల చేతివాటం రోజుకు రూ.లక్ష పైనే ఉంటుందని తెలిసింది. ఒక్క పులిహోర ప్రసాదం అమ్మకాల్లోనే రూ.90 వేలు పక్కదారి పడుతుండగా..భక్తులకు విక్రయించే టిక్కెట్లలో మరికొంత అక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కొందరు భక్తులు శ్రీ కనకదుర్గ ఆలయంలో లడ్డూ, చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలు తీసుకునేందుకు క్యూలైన్‌లో నిలబడ్డారు. పలువురి భక్తులకు లడ్డూ, చక్కెర పొంగలికి కంప్యూటర్‌ బిల్లు ఇచ్చిన ఉద్యోగులు పులిహోర ప్రసాదానికి ఇవ్వలేదు. అదేమంటే మీకు ప్రసాదం ఇచ్చాం కదా? వెళ్లండి అంటూ దురుసుగా ప్రవర్తించారు. కాదూ..కూడదు అన్న భక్తులపై క్యూలైన్‌ ఆగుతుందంటూ వెనుకున్న భక్తులను గొడవకు ఉసిగొలపడం ఉద్యోగుల నైపుణ్యానికి నిదర్శనం. పులిహోర తయారీకి ఆలయం గోదాము నుంచే దినుషులు తీసుకొని తయారు చేస్తూ డబ్బులు మాత్రం శ్రీ అమ్మవారి ఆలయానికి కాకుండా సొంత జేబుల్లోకి మల్లిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉద్యోగులను భక్తులు నిలదీయడంతో ఏదో పొరపాటు జరిగిందంటూ మరికొందరు అధికారులు సర్ధుబాటు ధోరణి ప్రదర్శించడం విశేషం. అయినప్పటికీ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు అధికారులు విచారణ జరుపుతామంటూ సర్థిచెప్పారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విషయంలోనూ ఇదే తరహా అవకతవకలు జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. గత దసరా నుంచి దుర్గగుడి అంతరాలయ దర్శనం రూ.500 చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదారుగురు భక్తులు అంతరాలయ దర్శనాలకు వెళితే మూడేసి టిక్కెట్లు మాత్రమే రూ.500కు ఇస్తూ మిగిలిన టిక్కెట్లు రూ.100కు జారీ చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం హడావుడిలో ఉండే భక్తులు ఇదేవీ పట్టించుకోకుండా వెళుతున్నారు. అక్కడ ఉండే సిబ్బంది కూడా వెంటనే వీరిని లోనికి పంపుతూ వ్యవహారం వెలుగు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒకే నంబర్‌తో టిక్కెట్లు..
ఇటీవల అన్నవరం దేవస్థానంలో ఒకే నంబరుతో పలు టిక్కెట్లు వెలుగులోకి వచ్చాయి. సత్యనారాయణ స్వామి వార్ల వ్రతం చేసుకునేందుకు వచ్చిన భక్తులు కొందరు ఆన్‌లైన్‌ టిక్కెట్లు తీసుకోగా ఇది చోటు చేసుకుంది. ఒకే నంబర్‌పై పలు టిక్కెట్లు రావడం కలకం రేపగా అధికారులు తొలుత సాఫ్ట్‌వేర్‌ సమస్యగా చెప్పారు. అయితే ఆలయ ఆదాయానికి గండిపడుతున్న అంశంపై భక్తులు నిలదీయడంతో విచారణకు ఆదేశించారు. ఇదే తరహాలో పలు ఆలయాల్లో సాఫ్ట్‌వేర్‌ను సాకుగా చూపుతూ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

గతంలో కూడా..
చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమలలో కొద్ది నెలల కిందట అన్నదానం డొనేషన్ల రశీదులు ఆన్‌లైన్‌కు బదులు మ్యాన్యువల్‌ రూపంలో ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. పేరుకు కంప్యూటర్లు ఉన్నప్పటికీ భక్తులు అన్న ప్రసాద వితర తీసుకున్న తర్వాత ఇచ్చే విరాళాలకు మ్యాన్యువల్‌ రశీదులు ఇచ్చారు. అదేమంటే ఏదైనా ఆలయానికే కదా? అంటూ సిబ్బంది భక్తులపై ఎదురు దాడికి దిగడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని ప్రతి ఆలయంలోనూ ఏదో ఒక రూపంలో అక్రమాలు జరుగుతున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులకు అటు అధికారులు..ఇటు రాజకీయ అండదండలు మెండుగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. పైగా కొన్ని చోట్ల పాలక మండలి సభ్యుల సహకారం కూడా వీరికి తోడవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement