Tuesday, November 26, 2024

ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి – డాక్టర్ బ్రహ్మారెడ్డి

చల్లపల్లి, ( ప్రభా న్యూస్): జీవితంలో రాణించేందుకు ప్రతి విద్యార్థి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి సూచించారు. చల్లపల్లి విజయా అకాడమీలో 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన సెమినార్ లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులను మంచి భవిష్యత్తుతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం ఎలా అనే అంశంపై బ్రహ్మారెడ్డి ఉపన్యసించారు. ప్రతి విద్యార్థి తనకున్న శక్తిసామర్థ్యాలను బేరీజు వేసుకుని జీవితంలో ఏం కావాలో నిర్ణయించుకోవాలనీ, అందరూ డాక్టర్లూ…ఇంజనీర్లే తయారు కానక్కర్లే లేదనీ, అన్ని వృత్తులూ సమాజానికి అవసరమేనన్నారు. ఏం కావాలని ఎంపిక చేసుకునే హక్కు విద్యార్థిదేనని స్పష్టం చేశారు. ఎవరి కాళ్లపై వారు నిలబడి సొంతంగా సంపాదించుకోవటం ప్రధాన లక్ష్యం కావాలనీ, తల్లిదండ్రులకూ..పిల్లలకూ మధ్య ప్రేమానుబంధం మాత్రమే ఉండాలన్నారు. సంపాదన మీకోసం, తల్లిదండ్రులకోసం, పిల్లలకోసం ఇలా మూడు తరాలకు మించి ఉండరాదని తెలిపారు. ఏ క్షణమైనా సంతోషంగా ఉండటమే గొప్ప జీవితమన్నారు. కెరీర్ లో డబ్బు సంపాదించటం ఒక్కటే లక్ష్యం కాదని తెలిపారు. మార్కులు సాధించటం ఒక్కటే ముఖ్యం కాదనీ, మానవ సంబంధాలు ఎంతో ప్రధానమని చెప్పారు. మాట్లాడటం రాకపోతే ఏ వృత్తిలోనూ రాణించలేరనీ, కెరీర్ కి కమ్యూనికేషన్ స్కిల్ ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి సరిగా ఆలోచించటం, సరిగా ఊహించటం చేయాలనీ, జీవితం కోసం నేర్చుకున్న పాఠాలు జీవితాంతం గుర్తుంటాయన్నారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలనీ, ప్రశ్నించటం మానవద్దని సూచించారు ప్రిన్సిపాల్ నాగళ్ల భీమారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛ చల్లపల్లి సారధి డాక్టర్ డిఆర్ కె.ప్రసాద్, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంపాన కృష్ణ కిషోర్, వంగల సుబ్బారావు, పాగోలు రమేష్ బాబులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement