Monday, November 25, 2024

నిస్వార్థ ‌సేవ‌కులు మ‌న వ‌లంటీర్లు – న‌గ‌దు పుర‌స్కారాల‌తో జ‌గ‌న్ స‌త్కారం..

విజయవాడ: నిస్వార్థంగా సేవ చేస్తున్న సైనికులు నా వ‌లంటీర్లని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శంసించారు. సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పథకాలను ఇంటి గడప వద్దే ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి సత్కారం, అవార్డుల ప్రదానోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి చేపట్టింద‌ని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం పోరంకిలో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రదానం చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ, ‘‘ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే చేరుస్తూ మన్ననలు పొందుతున్నారు. రూపాయి లంచం లేకుండా పెన్షన్ అందిస్తున్న మీరు గొప్ప సైనికులు. పేదల బాధలు తెలుసుకున్న మీరు గొప్ప మనస్సున్నవారు. ఒక వ్యవస్థలో వివక్ష లేకుండా వాలంటీర్లు పని చేస్తున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తిలా నేడు వాలంటీర్ భావిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మీరు క్రమశిక్షణతో ఉండి.. ఇలాంటి విమర్శలు పట్టించుకోవద్దు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు వేస్తారు.. వారి పాపానికి వారే బాధ్యులు. ధర్మాన్ని నెరవేర్చాలని కోరుతున్నా. మానవ సేవే మాధవ సేవ.. అని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో కూడా మరింత సేవ అందించాలని కోరుతున్నానని’’ ‌ అన్నారు. ‘సేవా దృక్పథం పనిచేస్తున్న వాలంటీర్లకు అవార్డులు అందజేస్తున్నాం. అత్యుత్తమ సేవలను వాలంటీర్లు అందిస్తున్నారు. సేవా మిత్ర అవార్డుకు రూ.10 వేలు, సేవా రత్న అవార్డుకు రూ.20 వేలు, సేవా వజ్ర అవార్డుకు రూ.30 వేలతో వాలంటీర్లకు పురస్కారాలు అందజేస్తున్నాం’ అని తెలిపారు. ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం అందిస్తామని వెల్లడించారు. నేటి నుంచి ప్రతి జిల్లాలో రోజుకొక నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని జగన్‌ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement