(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : నిత్యం ప్రజా సేవకు అందుబాటులో ఉంటూ నిష్పక్షపాతంగా పోలీస్ సేవలు అందిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఈ ఏడాది సాధారణ నేరాలు గణనీయంగా తగ్గాయన్న ఆయన సైబర్ నేరాలు మాత్రం పెరిగాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకుంటూ పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. డోన్లను విరివిగా వినియోగిస్తూ, అవసరాలకు అనుగుణంగా నూతన యాప్ లను రూపొందించే ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ పహారాతో విజిబుల్ పోలీసులకు పెద్దపేట వేస్తున్నామన్న ఆయన నేరాల కట్టడి చేయగలుగుతున్నామన్నారు.
సమాజ సేవలో భాగంగా ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల్లో పోలీసులు సమాజ సేవ అందిస్తున్నారని గుర్తు చేశారు. విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఎస్వీ రాజశేఖర్ బాబు వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 2024 సంవత్సరంలో పోలీసు శాఖ ఎన్నో సవాళ్లను అధిగమించిందని గుర్తు చేశారు. పోలీసు శాఖ పనితీరు ఎంతో అద్భుతంగా ఉందన్న ఆయన ప్రజలకు సేవ చేయడంలో పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా సేవలు అందించిందని తెలిపారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, ఇంకా చాలా గమ్యాలను చేరుకోవాల్సి వుందన్నారు. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారాలను చూపిస్తూ విజయం సాధించినట్లు తెలిపారు. అస్త్రం అనే ఆలోచన విధానం కలిగిన యాప్ తో దసరా ఉత్సవాలను, అలాగే ట్రాఫిక్ సమస్యలను విజయవంతంగా పరిష్కరించామన్నారు. భవాని దీక్షలను పోలీస్ శాఖ పనితీరుతో అద్భుతంగా సేవలందించగలిగామన్నారు.
దాతలు ముందుకు వచ్చి జిల్లాకు 27 డ్రోన్స్ ఇవ్వడం జరిగిందని, ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రోన్స్ ద్వా రా అధునాతన టెక్నాలజీతో అనేక నేరాలకు అడ్డుకట్ట వేయగలిగామన్నారు. 2025లో అనేక విధానాలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అస్త్రం యాప్ ను ఉపయోగించుకుని రాబోయే ఫ్లై ఓవర్ బ్రిడ్జిలపై, అలాగే మరెన్నో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టనున్నట్లు తెలిపారు. సైబర్ సిటిజన్ యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్లడం జరిగిందని, దాదాపు 3లక్షల మంది విద్యార్థులను సబ్ స్క్రైబర్ లుగా చేశామని ప్రకటించారు. సైబర్ సిటిజన్ యాప్ ద్వారా అవగాహన కల్పిస్తూ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడం జరిగిందన్నారు. వరదల సమయంలో పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేసి 14రోజుల పాటు విశిష్ట సేవలు అందించడం అభినందనీయమన్నారు.