Tuesday, November 26, 2024

అర‌గంట న‌డ‌క‌తో ఆరోగ్యం మ‌న సొంతం

ప్రతీరోజు అరగంట నడక ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని కలెక్టర్ నివాస్ అన్నారు. విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో విజయవాడ మారథాన్ వర్చ్యువల్ రన్ ను ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద ఆయ‌న ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతీ ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణపై అవగాహనా కలిగి ఉండాలన్నారు. వ్యాయామంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ప్రతీ వ్యక్తి రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం లేదా నడక అలవాటు గా చేసుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవన్నారు.

పరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నైతిక విలువలతో కూడిన జీవన విధానం ప్రతీ వ్యక్తికీ అవసరమన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటి వారిని పరిరక్షించాలన్నారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక రోజులలో మొక్కలను నాటడం ఒక అభిరుచిగా చేసుకోవాలన్నారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ విజయవాడ రన్నర్స్ వారు ప్రతీ సంవత్సరం మారథాన్ రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. మారథాన్ రన్ లో పెద్ద ఎత్తున యువతీ, యువకులు, సీనియర్ సిటిజన్స్, ప్రజలు పాల్గొనడంపై కలెక్టర్ నివాస్ సంతోషం వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా మారథాన్ రన్ లో పాల్గొన్న వారికి కలెక్టర్ మొక్కలను పంపిణీ చేసారు. మారథాన్ రన్ నిర్వాహకులు మణిదీపక్ మాట్లాడుతూ మారథాన్ రన్ 5 , 10, 21 కిలోమీటర్ల విభాగాలలో ఉంటుందన్నారు. కోవిడ్ కారణంగా వర్చ్యువల్ విధానంలో మారథాన్ రన్ నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది కూడా వర్చ్యువల్ పద్దతిలో రన్ నిర్వహించామని, మంచి స్పందన వచ్చిందన్నారు. ఇప్పడు కూడా రన్ లో పాల్గొనేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించి రన్ లో పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో విజయవాడ రన్నర్స్ నిర్వాహక కమిటీ సభ్యలు కృష్ణతేజ, నాగేశ్వరరావు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement