ఇబ్రహీంపట్నం : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం ది కృష్ణ కో-ఆపరేటివ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ సొసైటీ (గుంటుపల్లి)లో జరిగిన అవినీతిపై సబ్ డివిజన్ల సహకార అధికారి వారి కార్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ సత్యనారాయణ రెడ్డి గురువారం విచారణ నిర్వహించారు. ఫిర్యాదుదారుడు అద్దేపల్లి ఆంజనేయులు స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. సుమారు 80 సంవత్సరాల క్రితం రైతులు ఏర్పాటు చేసుకున్న సొసైటీ కింద 500 ఎకరాల ఆయకట్టు సాగయ్యేదని, కాలక్రమేణ ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతూ ప్రస్తుతం 200 ఎకరాలు సాగు లో ఉందని ఫిర్యాదుదారుడు వివరించారు. 2417 మంది సభ్యులు ఉన్న ఈ సొసైటీలో 2021- 22 ఏడాదికి రైతు ఎకరాకు రూ.1750 నీటి తీరువా చెల్లిస్తున్నారని చెప్పారు. ఏపీ సహకార సంఘం 1964 యాక్ట్ ప్రకారం 41 అండ్ 116 సీ అనుసరించి సొసైటీ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు బ్యాంకింగ్ ద్వారా జరపాల్సి ఉండగా, నగదు రూపంలో చెల్లిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సొసైటీ కి వచ్చే వార్షిక స్థూల ఆదాయంలో 10 శాతం మాత్రమే సిబ్బంది వేతనాలకు చెల్లించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సొసైటీ వారు 65 శాతం అధిక మొత్తంలో సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారని తెలిపారు. సొసైటీ ఇచ్చిన డిమాండ్ నోటీసు లో విద్యుత్ బకాయి కింద రూ.5.5 కోట్లు అప్పు ఉన్నట్లు చెప్పి రైతులపై ఆర్థిక భారం మోపుతున్నారని వివరించారు. విచారణ కొనసాగుతుందని, పూర్తయిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడిస్తామని విచారణ అధికారి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement