Monday, November 18, 2024

AP : పశ్చిమకు నేనే ముఠామేస్త్రిని…సుజనా

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ః పశ్చిమ నియోజకవర్గంలోని ముఠా కార్మికులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలుగుదేశం జనసేన పార్టీలు బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటానని సుజనా చౌదరి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల వస్త్రలతను సుజనా సందర్శించారు.

- Advertisement -

కార్మికులతో మమేకమై వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ముఠా కార్మికులు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఠా కార్మికుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం విస్మరించిందని, విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ముఠా కార్మికుల కోసం విశ్రాంతి భవనాన్ని మరుగుదొడ్లను నిర్మించే బాధ్యత తాను తీసుకుంటానని సుజనా హామీ ఇచ్చారు. నియోజకవర్గాన్ని, ముఠా కార్మికుల సంక్షేమాన్ని వెల్లంపల్లి తుంగలో తొక్కి అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని సుజనా మండిపడ్డారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల మీద అవగాహన కల్పించి అమలు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్మికుల పిల్లల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా ఐరన్ యార్డ్ కృష్ణవేణి మార్కెట్ ప్రాంతాలను సందర్శించి కార్మికుల కష్టాలను తెలుసుకున్నానన్నారు.

ముఠా కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. విద్య వైద్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తానని వివరించారు. పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి కార్మికుల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని కార్మికులందరూ అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సుజనాను గెలిపించుకుంటే, పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని, అందరం అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తాడి శకుంతల, బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమి నాయుడు, టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, ఓబీసీ జనరల్ సెక్రటరీ కిలారి శ్రీనివాస్, బేవర శ్రీను పిళ్ల కృష్ణ ప్రసాద్, భారీ సంఖ్యలో ముఠా కార్మికులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement