కృష్ణా, ప్రభన్యూస్ : ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే అటవీ సంపదను మానవుడు ధ్వంసం చేస్తుండటం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమిస్తోంది. విస్తీర్ణంలో 33 శాతం మేర ఆడవులు ఉండాలి. కానీ జిల్లాలో కేవలం 7 శాతం మాత్రమే అటవీ భూములు ఉన్నట్లు అధికారిక లెక్కలు తెటతేల్లంచేస్తున్నాయి. అడవులను నరికివేడయంతో పాటు వేలాది ఎకరాలు కబ్జాకోరాల్లో ఉన్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యానికి విఘాతంగా మారింది. విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, గన్నవరం ప్రాంతాలలో అటవీ భూములలో ఉన్న కొండలను ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మైనింగ్ మాఫియా తవ్వేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. వేలాది ఎకరాల అన్యాక్రాంతమైన అటవీ భూముల విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా 49,710.87 హెక్టార్లలో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 10,165.11 హెక్టార్లు ఆక్రమణల చెరలో మగ్గుతున్నాయి. అటవీ భూములను ఆనుకుని పొలాలు కలిగిన భూస్వాములు భూమిని కలుపుకొంటూ సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు 11వేల హెక్టార్లలో ఆక్రమణలకు సంబంధించి 3,000 కేసులను అటవీ అధికారులు పెట్టారు. మైనింగ్ అధికారుల అనుమతులు నామమాత్రంగా తీసుకుని కొండలను కనుమరుగు చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సి కోట్లాది రూపాయల ఆదాయం మైనింగ్ మాఫియా జేబుల్లోకి వెళ్లుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో అక్రమ మైనింగ్‌కు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. అలాగే 1967 సంవత్సరం రికార్డుల ప్రకారం రెడ్డిగూడెం, చాట్రాయి, విస్సన్నపేట మండలాల పరిధిలో 6 వేల హెక్టార్లలో అటవీ భూములు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం రికార్డుల ప్రకారం 3 వేల హెక్టార్లు మాత్రమే ఉండటం గమనార్హం.
విస్సన్నపేట మండలం కొండపర్వ, చాట్రాయి మండలం సోమవారం గ్రామాలలో అటవీ భూములకు సంబంధించిన వివాదం కోర్టులో ఉంది. చాట్రాయి అటవీ బ్లాక్‌లో 166.76 హెక్టార్లు ఛాట్‌మై విలేజ్‌లో ఉన్నట్లు సమాచారం. ముసునూరు మండలం కాండ్రెనిపాడులో దట్టమైన రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. మొత్తం 1,857 హెక్టార్లకు 1,594 హెక్టార్లు అన్యాక్రాంతమయ్యాయి. తిరువూరు మండల మల్లేల, రామన్నపాలెం, ఆంజనేయపురం,చౌటపల్లి రెవెన్యూ పరిధిలో వందల ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. పశ్చిమకృష్ణా పరిధిలోని తిరువూరు, మైలవరం, నూజివీడు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆక్రమణలకు గురైన అటవీ భూముల్లో పెసర, కంది, మినుము, మామిడి, జామ, నిమ్మ పంటలు సాగు చేస్తున్నారు. ఈ భూములు విలువ ఎకర రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. కొంత మంది ఈ భూములను ఆక్రమించి లీజుకు ఇచ్చారు. అయితే అధికార యంత్రాంగం కబ్జా కోరాల్లో ఉన్న అటవీ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడుతోంది. తెరవెనుక రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు కారణంగా చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా 50 వేల హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. వీటిలో 16వేల హెక్టార్లు మడ అడవులు విస్తరించి ఉన్నాయి. నాగాయలంక, అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో విస్తరించిన ఈ మడ అడవులను ఆక్రమించి చెరువులను తవ్వేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అటవీ భూములను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..