(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : త్వరలోనే నందిగామ, కొండపల్లి మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ల ఎన్నిక జరగనుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాద్ (చిన్ని) ప్రకటించారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులతో త్వరలోనే భేటీ కానున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ఆయన సోమవారం ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో పాటు కూటమి నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
నందిగామ ప్రాంతానికి అత్యంత అవసరమైన వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. నందిగామ, జగ్గయ్య పేట పరిధిలోని ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందించే సమస్య దీని ద్వారా తీరుతుందన్నారు. నందిగామ, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిపించేందుకు త్వరలోనే ఎన్నికల అధికారులను కలిసి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, కూటమిలోని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాద్ కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల నుండి వారి ప్రాంతంలోనే ఎదురుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.