అమరావతి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెత్త పన్ను చెల్లించని ప్రజల ఇళ్ల ముందు చెత్త వేయాలని, అలా చేస్తే వారికి బుద్ధి వస్తుందని వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యమని పౌర సమాఖ్య కన్వీనర్ సిహెచ్.బాబూరావు అన్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వాలు, స్థానిక సంస్థల రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. కరోనా మరోసారి విస్తరిస్తున్న సమయంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను గాలికొదిలి ఇళ్ల ముందు చెత్త వేయాలని వ్యాఖ్యానించడం ప్రజారోగ్యంతో చెలగాటమాడటమే తప్ప మరొకటి కాదని ఖండించారు. రుణ సేకరణకు కేంద్రం పెట్టిన షరతులకు లొంగి రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను బలవంతంగా ప్రజలపై రుద్దడం గర్హనీయమన్నారు. ఇప్పటికే పలుచోట్ల చెత్త పన్నును ప్రజలు ప్రతిఘటిస్తున్నారని పేర్కొన్నారు. ప్రసాదరావు వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరి, అహంభావానికి అద్దంపడుతున్నాయని వ్యాఖ్యానించారు. చెత్త పన్ను చెల్లించకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ధర్మాన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital