Friday, November 22, 2024

మాజీ కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారం

అవనిగడ్డ, (ప్రభ న్యూస్): దివిసీమ గాంధీ, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు 98వ జయంతి వేడుకలు అవనిగడ్డ గాంధీ క్షేత్రం ఆవరణలో ఇవ్వాల (శుక్ర‌వారం) ఘనంగా జరిగాయి. గాంధీ క్షేత్రం కమిటీ మండలి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పూర్వపు కలెక్టర్‌ బాలయ్య నాయుడు లక్ష్మీకాంతంకు మండలి వెంకట కృష్ణారావు స్మారక పురస్కారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎంతోమంది కలెక్టర్లు పనిచేశారని, అందులో బి.ఆర్‌.మీనా, ప్రభాకర్‌ రెడ్డి, నవీన్‌ మిట్టల్‌ దివిసీమ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసారని గుర్తుచేశారు.

అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లాకు కలెక్టర్‌ గా విచ్చేసిన డా.బి.లక్ష్మీకాంతం తన పరిపాలనలో అనేక కొత్త పోకడలను తీసుకొచ్చారని అన్నారు. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే అక్కడి రాజకీయ నాయకుల కంటే అధికారుల పాత్ర చాలా ప్రధానమైనదని, అటువంటి గొప్ప పాత్రను పోషించిన లక్ష్మీకాంతం కృష్ణాజిల్లాను అన్ని రంగాలలో ముందంజలో ఉంచారని అన్నారు.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లాలలో కృష్ణాజిల్లా ఎప్పుడూ ముందుగా ఉండేదని అన్నారు. జవాబుదారీ పాలనకు పెట్టింది పేరుగా లక్ష్మీకాంతం నిలిచారని, పత్రికలలో కానీ, ప్రసార మాద్యమలలో కానీ, సోషల్‌ మీడియా లో కానీ ఏదైనా సమస్య కనపడితే ఆ సమస్యను వెంటనే పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులలో ఆయన ముద్ర చేరగలేనిది అని అన్నారు. అటు-వంటి గొప్ప అధికారికి తన తండ్రి పేరిట స్మారక పురస్కారం అందచేయడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు.

మహోన్నతుడు మండలి: లక్ష్మీకాంతం

శ్రీకృష్ణుడు ద్వారకను నిర్మించినట్లుగా ఉప్పెనతో కకావికలమైన దివిసీమ ను పునర్మించిన మండలి వెంకట కృష్ణారావు మహోన్నతుడని ఉమ్మడి కృష్ణాజిల్లా పూర్వపు కలెక్టర్‌ డా.బాలయ్య నాయుడు లక్ష్మీకాంతం ఐ ఏ ఎస్‌ అన్నారు. దివిసీమ గాంధీగా పేరొందిన మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు అనేక శాఖలలో జవాబుదారీతనంతో పనిచేశారని, తెలుగుభాష అభివృద్ధి కి విశేష కృషి చేశారన్నారు. సుమారు ఐదేళ్ల తర్వాత అవని లాంటి అవనిగడ్డలో అడుగు పెట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, తనకు ఎంతో ప్రేమతో స్వాగతం పలికిన దివిసీమ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ తేజోమూర్తుల వెంకటేశ్వరరావు రచించిన ఇంద్రధనస్సు పద్యకావ్యం పుస్తకాన్ని డా.పాలపర్తి శ్యామలనంద ప్రసాద్‌ అవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement