ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ః విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో చైత్రమాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర శుద్ధ చతుర్ధశి తత్కాల పౌర్ణమి వరకు ఈనెల 19 నుండి 27వ తేదీ వరకు జరిగే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శుక్రవారం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీ గంగా దుర్గ మల్లేశ్వర స్వామి వార్లకు మంగలస్నానములాచరింపజేసిన అనంతరం వధూవరులుగా అలంకరణ చేశారు.
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానం లో ఉపాలయమైన శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంఒద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు సమక్షంలో మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు, ప్రధానార్చకులు, అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవార్లకు, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం సాయంత్రం 4 గం శ్రీ విగ్నేశ్వర స్వామి వారికి పూజ, పుణ్యాహవచనము, అంకురారోపన, అఖండ దీప స్థాపన, కళాశారాధన, ధ్వజారోహన, అగ్ని ప్రతిష్టాపన బలిహరణ కార్యక్రమములు శాస్త్రాక్తంగా నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం 5 లకు వెండి పల్లకీ పై స్వామి, అమ్మవార్లు శ్రీ మల్లిఖార్జున మహా మండపము నుండి బయలుదేరి కనకదుర్గా నగర్, రధం సెంటర్, బ్రాహ్మణ వీధి, కోమలావిలాస్ సెంటర్, సామారంగం చౌక్, బ్రాహ్మణ వీధి, రధం సెంటర్ మీదుగా రథోత్సవంలో భాగంగా మహా మండపానికి చేరుకోనున్నారు.