Saturday, September 28, 2024

AP: మత రాజకీయాలకు తెరదీసిన బాబు… దేవినేని అవినాష్

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : తిరుపతి లడ్డు వివాదం మొదలు, డిక్లరేషన్ పేరుతో మత వివాదాలకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబును శిక్షించి రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల పవిత్రతను శ్రీవారి ప్రసాదం విశిష్టతను టీటీడీ పేరు ప్రఖ్యాతులను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలలో పూజలు చేయాలని పిలుపునిచ్చిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అన్ని ప్రాంతాలలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. విజయవాడలోని లబ్బీపేట లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను దేవినేని అవినాష్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే నీచ రాజకీయాలు చంద్రబాబు నాయుడు, టిడిపికే చెల్లిందన్నారు. ఈరోజు చంద్రబాబు వల్ల రాష్ట్ర ప్రతిష్ట తీవ్రస్థాయిలో దెబ్బతిందన్నారు. ప్రజలు తమను విమర్శిస్తారు, ప్రశ్నిస్తారని డైవర్ట్ రాజకీయాలకు తెరతీసారని ఆరోపించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మాజీ మంత్రి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలను నిర్వహించారు. టిటిడి ప్రతిష్టను మంట కలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నగరంలోని సత్యనారాయణపురంలోని గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

జగ్గయ్యపేటలో స్వామివారి ఆలయంలో నియోజకవర్గ ఇన్చార్జి తన్నేరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుమల లడ్డు ప్రసాదం వివాదం సమస్య పోవాలని అందుకు కారకులైన వారికి తగిన శాస్తి జరగాలని శ్రీవారి ప్రసాద విశిష్టతను కాపాడాలని కోరుతూ నందిగామ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. టీటీడీ వైభవాన్ని చంద్రబాబు నాయుడు అపవిత్రం చేసినందున పాప ప్రక్షాళన జరగాలని కోరుతూ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement