( ఆంధ్రప్రభ తిరువూరు) : తిరువూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఇక్కడకు వచ్చి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ తీసుకోవచ్చని ఆయన సూచించారు.
వచ్చే ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో 25 వేలమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కల్పిస్తామని ప్రకటించారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కనుగుణంగా తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ పలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ పోలీస్ మెయిన్స్, డీఎస్సీ కోచింగ్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేరయ్యే విద్యార్ధిని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం కోచింగ్ సెంటర్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గతంలో పేద,మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కోచింగ్ వెళ్ళాలంటే హైదరాబాద్, కాకినాడ,అవనిగడ్డ కు వెళ్ళేవారు,కానీ ఇకపై అలాంటిది ఉండదని, లక్ష్యంఉన్న విద్యార్దులు ఇకపై తిరువూరు బస్సు ఎక్కి నేరుగా ఇక్కడికి రావాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ లక్ష్యం,రాబోయే 5ఏళ్లలో నియోజకవర్గంలో 25వేల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యం అన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యార్దులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరం లోపు డీఎస్సీ ప్రారంభం అవుతుందన్నారు. ఈలోపే గ్రూప్-2, కానిస్టేబుల్ మెయిన్స్ ఉన్నాయి కాబట్టి కోచింగ్ సెంటర్ ను విద్యార్దులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
విద్యార్దులకు ప్రతిరోజు మొదటగా ఉండాల్సింది అటెండెన్స్,రెండవది పర్ఫామెన్స్,మూడవది ఎక్సలెన్స్ అని తెలిపారు. ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వారే ఇక్కడ ఉంటారు,నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు ఇక్కడ ఉండరని చెప్పారు. డీఎస్సీ, ఐఏఎస్ రాయలనుకున్న వారు తప్పనిసరిగా ప్రిపరేషన్ కావాలని, కోచింగ్ వలన ఉద్యోగం రాదు,చదువు తో పాటు కోచింగ్ ఉంటేనే ఉద్యోగం వస్తుందని భరోసా ఇచ్చారు.
వారికి 15 రోజులకు పరీక్షలు పెడతాను వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందిస్తానన్నారు. డీఎస్సీలో అవినీతి అనే మాటే ప్రస్తావన ఉండదని,,అందుకే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారానికి రెండు మూడు సార్లు కోచింగ్ సెంటర్ కు వస్తాను, విక్లి టెస్ట్ లో ఫెర్మమెన్స్ బాగుంటుందో వారికి మా సహకారం ఉంటుందన్నారు. మన తీసుకొచ్చే రిజల్ట్స్ బట్టే తిరువూరు అభివృద్ధి చెందుతుందన్నారు.