Saturday, November 23, 2024

AP: అన్నదాన భాగ్యం పూర్వ జన్మ సుకృతం : ఢిల్లీరావు..

(ప్రభ న్యూస్ విజయవాడ) : అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యే అవకాశం కలగడం పూర్వ జన్మ సుకృతమని, మానవ సేవను మించిన సేవ మరొకటి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి తాడేపల్లిలోని రివర్ బ్రీజ్ అపార్ట్ మెంట్ వాసులు నన్నపనేని శివన్నారాయణ, అరుణ, దద్దనాల సూర్యనారాయణ రావు, అనిత దంపతుల ఇంట జరిగిన విజయేంద్ర, రమ్యతేజల వివాహ సందర్భంగా 10 టన్నుల కూరగాయలను విరాళంగా అందించారు.

కూరగాయల వాహనానికి శనివారం ఢిల్లీరావు రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ
ఉండదన్నారు. మనం చేసే ప్రతి పని వెనుక భగవంతుని సహకారం ఉంటుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన కీర్తిశేషులు మండవ కుటుంబరావు వంటి వ్యక్తుల ఆశయాలను కొనసాగిస్తున్న మరడ నాగేంద్రను అభినందించారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. మానవ సేవ చేస్తే మాదవ సేవ చేసినట్లేనన్నారు.

జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. మనం చేసే ప్రతి సత్కార్యము మనం నమ్మిన దైవశక్తి పిలుపు మేరకే నిర్వహించగలుగుతున్నామన్నారు. ధార్మిక సేవలో పాల్గొనడం, కార్యక్రమాలు నిర్వహించడంలో ఉండే ఆనందం అంతులేని సంతోషాన్ని, మానసికంగా మన మనసుల్లో సానుకూలమైన దృక్పథాన్ని పెంపొందిస్తుందని శాస్త్రవేత్తలు సైతం వివిధ పరిశోధన ద్వారా గుర్తించారని తెలిపారు. తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంతోషం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు. భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. శుభకార్యాలు నిర్వహించుకునే సమయంలో పెట్టే ఖర్చులో కొంత యిటువంటి అద్వితీయ వితరణకు సహాయం అందించాలన్నారు. అన్నదానానికి సహకరించిన దాతలు నారాయణరావు దంపతులు అభినందనీయులని ప్రశంసించారు. కార్యక్రమంలో రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ సభ్యులు, పలువురు ధార్మిక, ఆధ్యాత్మికవాదులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement