గన్నవరంలో నిన్న జరిగిన టీడీపీ – వైసీపీ శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు టీడీపీ పిలుపునిచ్చిన చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు అని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి ప్రేరేపించడం, బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందన్నారు. దీనివల్ల విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందన్నారు. పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు. తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం అని, సుమోటోగా రైటింగ్, నాన్ బేలబుల్ కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు అన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144, సీఆర్పీసీ, 30 పోలీస్ యాక్ట్ అమలలో ఉందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదన్నారు. గన్నవరం పరిసర ప్రాంతాలకు ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని, శాంతి భద్రతలను కాపాడతాం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించవలని జిల్లా ఎస్పీ జాషువా కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement