విజయవాడ క్రైమ్, (ఆంధ్ర ప్రభ ) : ఇన్‌స్టా పరిచయంతో ఆర్మీ ఉద్యోగి చేతిలో నగరానికి చెందిన మహిళ బండి ఆశ (35) మోసపోయింది. బాధితురాలు చెప్పిన వివరాల మేరకు… పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బండి ఆశ పిల్లల చదువుల కోసం నగరానికి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్మీలో పనిచేసే ఆళ్ళ రామకృష్ణ పరిచయం అయ్యాడు.
ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పశ్చిమ బెంగాల్‌కు రావాలని ఆశను నమ్మబలికాడు. రామకృష్ణ మాటలను నమ్మిన ఆశ పశ్చిమబెంగాల్ వెళ్ళింది. పశ్చిమబెంగాల్‌లో ఉద్యోగం కోసం అంటూ ఆశ వద్ద నుంచి రూ.8 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత ఉద్యోగం కోసం ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ దాటవేశాడు.
దీంతో రామకృష్ణ స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు వెళ్ళి నగదు కోసం అడిగారు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా నోటికి వచ్చినట్లు మాట్లాడటంతో ఆశ మనస్తాపంకు గురయ్యింది. దీంతో బాధ భరంచలేని ఆశ మురళీనగర్‌లోని నివాసంలో శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. స్ధానికులు ఆశను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని తనకు ఇవ్వాల్సిన రూ.8లక్షలు ఇవ్వాలని ఆశ కోరుతున్నారు. చేతిలో డబ్బులు లేక తన పిల్లలను స్కూలుకు సైతం పంపించలేని స్ధితి ఏర్పడిందని ఆశ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సంపాదించిన రూ.8 లక్షలు మోసపోవటంతో పాటు తల్లి ఆరోగ్య స్ధితి పాడవ్వటంతో ఆశ ఇరువురు కుమార్తెలు, కుమారుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.