Monday, November 25, 2024

Krishna YSRCP Politics – బాలశౌరికి ఎసరు ? పార్థ‌సార‌ధికి ముసురు …

(ప్రభ న్యూస్ బ్యూరో – కృష్ణా) కృష్ణాజిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఐ ప్యాక్ నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికకు వైసీపీ కసరత్తు చేస్తుండడంతో ఎవరికి టికెట్టు ఉంటుందో.. ఎవరి టిక్కెట్ ఊడుతుందో అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో అసంతృప్తి వైసీపీ నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లిపోకుండా సర్ది చెప్పే మంతనాల్లో అధిష్టానం మునిగి తేలుతోంది. రెండు జిల్లాల్లో ఇప్పటికే అనేక మంది వైసీపీ కీలక నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా శాసనసభ్యులు సోమవారం సీఎంఓ బాట పట్టారు. కొంత మంది తమ టిక్కెట్ కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వెళ్లగా.. మరికొందరిని ముఖ్యమంత్రి పిలిపించినట్టు తెలుస్తోంది. పేర్ని వెంకట్రామయ్య( నాని), కొడలి శ్రీ వెంకటేశ్వరరావు( నాని), కైలే అనిల్‌కుమార్‌, కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్ తాడేపల్లి దర్బారుకు వెళ్లారు. ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం లభించగా, మిగిలిన నాయకులు సీఎంవోలో ధనుంజయ రెడ్డిని కలిసి వెళ్లారు. ఇదే సమయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు అసంతృప్తి నేతలను బుజ్జిగించే ప్రయత్నంలో ముమ్మరంగా సాగుతున్నాయి.

ఎంపీ బాలశౌరికి ఎసరు ?

మరోవైపు వల్లభనేని బాలశౌరి కూడా పార్టీ మారతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే సినీ దర్శకుడు వివి నాయక్ ను రంగంలోకి దించటానికి అధిష్టానం యత్నించినట్టు సమాచారం. ఏతావాతా బాలశౌరి స్థానంలో మరో వ్యక్తి కోసం వైసీపీ అధిష్టానం అన్వేషణలో ఉన్నట్టు కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ఇక ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో బాలశౌరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే.. సామాజిక కార్డుతో బాలశౌరి జనసేనలో కలుస్తారని మచిలీపట్నం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తాము వైసీపీకి దూరం కానున్నట్టు బాలశౌరి అనుచర వర్గం ప్రచారం ఊపందుకుంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ పరిధిలో మెజార్టీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థానంలో మరొకరికి కేటాయించాలని గతంలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు ఎన్ని రాజకీయాల చేసిన తిరిగి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఆయనను వ్యతిరేకిస్తున్న శాసనసభ్యులు మాత్రం చాప కింద నీరుల తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఎమ్మెల్యే సారథికి ఆఫర్..

పెనమలూరు శాసనసభ్యులు కే పి సారథిని మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలని అధిష్టానం పెద్దలు సూచించారు. దీంతో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి మార్పు తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, కైలే కలిసి సారథిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. సారథికి పెనమలూరు టికెట్‌ కాకుండా మచిలీపట్నం ఎంపీ స్థానం ఇవ్వాలన్న యోచనలో వైసీపీ అధిష్టానం భావిస్తోంది. తొలుత సారధిని గన్నవరానికి పంపించాలని, అక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పార్టీ పెద్దలు భావించారు. సారథి అందుకు సుముఖత చూపలేదు. మరోవైపు మంత్రిగా తనకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితోపాటు ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనన్న ఆలోచనలో ఉన్న సారథి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో సీఎంఓ నుంచి సారథికి పిలుపు వచ్చింది. కానీ ఆయన బయలుదేరి వెళ్లడానికి ఇష్టపడలేదు. దాంతో ప్రాంతీయ సమన్వయకర్త రాజశేఖర్ పోరంకి వచ్చి సారథితో చర్చలు జరిపి వెంట బెట్టుకుని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని శాసనసభ్యులు అందరూ సహకరిస్తారని, ఎంపీగా పోటీ చేయాలని పార్టీ పెద్దలు సారథిని కోరినట్టు సమాచారం.

- Advertisement -

ఈ ప్రతిపాదనకు సారథి తిరస్కరించారని సమాచారం. పార్థసారథిని తన కార్యాలయానికి సోమవారం పిలిపించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వైసీపీలోనే కొనసాగాలని, తాము సముచిత స్థానం ఇస్తామంటూ నచ్చచెప్పినట్టు తెలుస్తోంది. అయినా పార్థసారథి సానుకూలంగా స్పందించలేదని సమాచారం.పార్థసారథికి పార్టీలో సరైన గౌరవం ఇవ్వకుండా చాలాకాలంగా అవ మానించే ధోరణి అవలంబిస్తున్నట్టు ఆయన వర్గం నేతలు పేర్కొంటు న్నారు. అందుకే ఇక వైసీపీలో తాను కొనసాగలేననే నిర్ణయానికి సారథి వచ్చినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇటీవల కంకిపాడు లో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర సందర్భంగా జరిగిన సభలో ముఖ్య మంత్రి జగన్ తీరుపై బహిరంగ వేదికపైనే తన అసహనం బయట పె ట్టారు. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం గుండెల్లో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీ పెద్దల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సారథి పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నచ్చ చెప్పిన, పార్టీ పెద్దలు బుజ్జగించిన కేపీ సారధి తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలుస్తోంది. దీంతో వైసపీపీ రాజకీయాలు ఏ తీరానికి దాటనున్నాయో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement