అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కృష్ణా జలాల వినియో గంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం మనుగడలో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా జల వివాదాల పరిష్కార -టైబ్యునల్ – కేడబ్ల్యూడీటీ–2) అవా ర్డు అమల్లోకి వచ్చేంతవరకు బచావత్ ట్రిబ్యునల్ (కేడ బ్ల్యూ డీటీ–1) ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జు సాగర్ రూల్ కర్వ్స్ (నిర్వహణ-నియామవళి)ను అమలు చేయాలని వెల్లడించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సీడబ్ల్యూసీ అధికారిక సమాచారమందించింది. రూల్ కర్వ్స్ ఖరారుపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఈనెల రెండోవారంలో నిర్వహించనున్న కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంపై ప్రభావం చూపిం చనుంది. కృష్ణాలోని ఉమ్మడి ప్రాజె క్టుల్లో నీటి పంపిణీపై అనేకసార్లు కృష్ణా బో ర్డు రిజర్వాయర్ మేనేజ్ మెంట్ కమిటీ- (ఆర్‌ఎంసీ) సమా వేశాలు నిర్వహించింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరనప్పటికీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను క్రోడీ కరించి నివేదిక రూపొందించి సీడబ్ల్యూసీకి అందించింది. ఆర్ ఎంసీలో తీసుకున్న నిర్ణయాలను బోర్డు సర్వసభ్య సమావేశ ంలో ఆమోదించి ఆ మేరకు రూల్ కర్వ్స్‌ను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై దిశా నిర్దేశం చేస్తూ కృష్ణా బోర్డుకు సీడబ్ల్యూసీ సమా చార మందించింది. దీనిపై ఏపీ నుంచి చెప్పుకోదగ్గ అభ్యంతరాలు వ్యక్తం లేకపోయినా తెలంగాణ మాత్రం బోర్డు సర్వసభ్య సమావేశంలో తమ వాదనను బలంగా విని పించేందుకు అవకాశం ఉంది.
అడ్డం తిరిగిన తెలంగాణ
శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి పంపిణీపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిద్దం చేసిన ముసాయిదాపై చర్చించిన తరువాత కృష్ణా బోర్డు రూపొందించిన రూల్ కర్వ్స్ నివేదికపై సంతకాలు చేసేందుకు తెలంగాణ నిరాకరించింది. కృష్ణా బోర్డు రిజర్వాయర్ మేనేజింగ్ కమిటీ- గత ఏడాది ఆరుసార్లు సమావేశమై రెండు రాష్ట్రాల జలవన రుల శాఖ ఉన్నతాధికారులతో చర్చించింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు కొన్ని విషయాలపై ఏపీ, తెలంగాణల మధ్య ఏకాభిప్రాయం సాధించింది. ఆర్‌ఎంసీ సమావేశాల్లో బోర్డు మార్గదర్శకాలకు అంగీకారం తెలిపిన తెలంగాణ ఆ తరువాత నివేదికపై సంతకాలు చేసేందుకు నిరాకరించింది. ముసాయిదా నివేదికపై కేవలం ఏపీ అధికారులు మాత్రమే సంతకాలు చేశారు. 2021 జులై 15న కేంద్ర జలశక్తి జారీ చేసిన నోటిఫికేషన్‌లో భాగంగా రూల్ కర్వ్స్‌పై ముసాయిదా నివేదిక సిద్దమైంది. ముసాయిదాపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకునేందుకే గత ఏడాదంతా సరిపోయింది. చివరకు గత ఏడాది డిసెంబరు 8న నిర్వహించిన జలాశయాల నిర్వహణ కమిటీ- (ఆర్‌ఎంసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రూల్ కర్వ్స్ నివేదిక సిద్దమైనా తెలంగాణ అడ్డం తిరగటంతో దాని అమలు సందిగ్ధంలో పడింది.
ఇదే రూల్ కర్వ్స్..
శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి పంపిణీ నిర్వహణ, నియమావళి (రూల్ కర్వ్స్) ముసాయిదాను బచావత్ -టైబ్యునల్ అవార్డుకు లోబడి రూపొందించారు. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుని 811 టీ-ఎంసీలు అందుబాటు-లో ఉంటాయని నిర్దారించారు. దీనిలో 512 టీ-ఎంసీలు ఏపీ, 299 టీ-ఎంసీలను తెలంగాణకు కేటాయించారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత కల్పించాలి..సాగు నీటి అవసరాలు కూడా తీరాకే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటు-ంది. జులై 1 నుంచి అక్టోబరు 31 వరకు శ్రీశైలం కనిష్ట నీటి మట్టం 854 అడుగులు ఉండాలి. అంతకన్నా తక్కువ నీటి మట్టం నమోదై ఉన్న సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుదుత్పత్తి కోసం నీటిని తరలించకూడదని ముసాయిదా నివేదికలో సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఈ మేరకు బచావత్ -టైబ్యునల్ అవార్డును ఉటంకిస్తూ రూల్ కర్వ్స్‌పై కృష్ణా బోర్డుకు దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో ఈనెల రెండవవారంలో నిర్వహించతలపెట్టిన కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలో తీర్మానం అత్యంత కీలకంగా మారనుంది.