ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. దాదాపు 125 ఏళ్ల తర్వాత ఇంత స్థాయిలో వరద నీరు రావడం ఇదే మొదటిసారి. ఈ సమయంలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహానికి బోటు అడ్డం పడటంతో 69వ గేటు విరిగిపోయింది. దీంతో మిగిలిన గేట్లు కూడా విరిగిపోతాయేమోనన్న ఆందోళన ఇంజినీరింగ్ నిపుణుల్లో వ్యక్తమవుతుంది. దీంతో వెంటనే చంద్రబాబు స్పందించారు.. గేట్లను అమర్చడంలో ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్యను పిలిపించారు. ఆయన ఇవాళ ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించారు. బ్యారేజీ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన అయిస్ట్ బ్రిడ్జి ఎక్కి పరిశీలించారు. రెండు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు. గేట్లు ఎత్తడం, మూయడం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటార్ యంత్రాల పనితీరును తెలుసుకున్నారు.
బోట్ల తొలగింపునకు కాకినాడ నుంచి నిపుణులు
తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న బోట్లను తొలగించాలని అధికారులకు కన్నయ్యనాయుడు సూచించారు. వాటిని తొలగించాకే మరమ్మతులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మరోవైపు దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా చేపట్టారు. బోట్లు తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అనంతరం కన్నయ్య మీడియాతో మాట్లాడుతూ, బోట్లు ఢీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజీకి నష్టం లేదని ప్రాజెక్టు గేట్ల నిపుణుడు తెలిపారు. గేట్లు, గోడలు అన్నీ పటిష్టంగానే ఉన్నాయని, కేవలం కౌంటర్ వెయిట్ లు దెబ్బతిన్నాయని తెలిపారు. దెబ్బతిన్న వాటిని తొలగించి కొత్త కౌంటర్ వెయిట్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్యారేజీ గేట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బోట్లు తొలగించవచ్చని పేర్కొన్నారు. నీటిమట్టం 8 లక్షల క్యూసెక్కులకు చేరిన తర్వాత పనులు ప్రారంభిస్తామని కన్నయ్య నాయుడు తెలిపారు. కౌంటర్ వెయిట్స్ ని వర్క్ షాపులో తయారు చేసి ఇక్కడకు తెచ్చి అమర్చుతామని చెప్పారు. కొత్త కౌంటర్ వెయిట్స్ ని అమర్చడానికి 15 రోజులు సమయం పడుతుందని తెలిపారు.