Saturday, November 23, 2024

జాతీయ రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం – మంత్రి జోగి రమేష్ , ఎంపీ బాలశౌరి

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో. – ఉమ్మడి కృష్ణజిల్లాలో జాతీయ రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, విజయవాడలో నోవాటెల్ హోటల్ నుండి నిడమానూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ పూర్తి చేయడం జరిగిందని, పామర్రు – చల్లపల్లి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కృష్ణా నదిపై వంతెన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయనున్నట్లు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ లు తెలిపారు.

కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలో జాతీయ రహదారుల అభివృద్ధికి చేపట్టిన పనుల ప్రగతిపై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసౌరి, ఎన్ టి ఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన శాసనసభ్యులు జాతీయ రహదారుల అధికారులు వివిధ శాఖలకు చెందిన అధికారులతో శుక్రవారం నగరం లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లభనేని మాట్లాడుతూ ప్రధానంగా జాతీయ రహదారి 65 పరిధిలోని విజయవాడ – మచిలీపట్నం నాలుగు లైన్ ల జాతీయ రహదారి అభివృద్ధి ఫై పూర్తి స్థాయిలో చర్చించడం జరిగిందని అన్నారు.

రానున్న రెండు సంవత్సరాల్లో బందరు పోర్టు పూర్తి కానున్న నేపథ్యంలో విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి అత్యంత ప్రాధాన్యతను సాదించుకోబోతుందన్నారు. ఈ పరిస్థితుల్లో జాతీయ రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనీ నేషనల్ హై వే అధికారులకు సూచించామన్నారు. విజయవాడ – మచిలీపట్టణం జాతీయ రహదారిలో ఉన్న లోపాలను సరిదిద్ది అవసరమైన చోట్ల అండర్ పాస్ నిర్మాణాలను పూర్తి చేయాలనీ, కంకిపాడు – పామర్రు ప్రాంతంలో లైటింగ్ ను ఏర్పాటు చేయాలనీ కోరామన్నారు. జాతీయ రహదారి – 16 ఫేజ్ – 3, ఫేజ్ – 4 లలో ఎదురయ్యే సమస్యలపై చర్చించి అవసరమైన పరిష్కార మార్గాలను సూచించామన్నారు.

- Advertisement -

హైదరాబాద్ – గుంటూరు జాతీయ రహదారిని కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు 60 శాతం పైగా పూర్తి అయ్యాయని బ్రిడ్జి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించామన్నారు. విజయవాడ నుండి గన్నవరం జాతీయ రహదారి వైపు నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం కొనసాగిస్తామన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ నుండి నిడమానూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మించడం ద్వారా ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరు అయిన 13 వేల కోట్ల రూపాయల నిధుల నుండి ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలనీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చామన్నారు.

నగరంలోని ఈస్ట్ బై పాస్ రోడ్డు ఎలైన్ మెంట్ పనులు పూర్తి చేయడం జరిగిందని ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణకు సంబంధించి సుమారు 100 ఎకరాలు భూమిని బదలాయించవలసి ఉందన్నారు. కంకిపాడు – గుడివాడ రహదారికి ఇరువైపులా కాల్వలు ఉన్న కారణంగా తరచూ రోడ్డు దెబ్బతినడం జరుగుతున్నదని దీనిని గ్రీన్ ఫీల్డ్ రహదారిగా తీర్చిదిద్ధేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని త్వరలో ఈ రహదారిని అభివృద్ధి చేయడం ద్వారా విజయవాడ నుండి గుడివాడ చేరుకునే ప్రయాణీకులకు సుమారు 23 కిలోమీటర్ల ప్రయాణ దూరం కలిసివస్తుందన్నారు.

పామర్రు – చల్లపల్లి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిలో విలీనం చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. కృష్ణా ఎన్ టి ఆర్ జిల్లాలలో జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి ఎదురయ్యే భూ సేకరణ సమస్యలపై ఆయా జిల్లాల కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి పెట్టి జాతీయ రహదారుల అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ సూచించామన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి భూ సేకరణలో రైతులకు తగిన న్యాయం జరిగేలా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ చెప్పారు.
జాతీయ రహదారుల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నేషనల్ హై వే అథారిటీ అఫ్ ఇండియా అధికారులు నారాయణరెడ్డి, శ్రీనివాసరావు, జి. దుర్గాప్రసాద్, జి. పద్మ, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, వెలంపల్లి శ్రీనివాసరావు, కొలుసు పార్థసారధి, వసంత కృష్ణ ప్రసాద్, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు, జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్, మునిసిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ ఫుడ్కర్, డి. ఆర్. ఓ. కె. మోహన్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, జాయింట్ కలెక్టర్ డా. అపరాజితా సింగ్, కృష్ణా, ఎన్ టి ఆర్ జిల్లాలకు చెందిన ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యూ ఎస్, రెవెన్యూ శాఖల అధికారులు
పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement