మచిలీపట్నం జూలై 26:— జిల్లాలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎడతెరిపి లేకుండా గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపి)ప్రకారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా తక్షణమే స్పందించి తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. మచిలీపట్నం, కంకిపాడు, పెడన తదితర ప్రాంతాల్లో కాలువలు పొంగి పొర్లుతున్నాయని వాన నీటిని ఎప్పటికప్పుడు యంత్రాలతో తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా పర్యవేక్షించాలన్నారు. జల వనరుల శాఖ ఇంజనీర్లు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుండి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారని అది 1,20,000 క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందజేయాలన్నారు.
అదనపు నీటిని విడుదల చేసే చేసే ముందుగా తెలియజేయాలని, నదులు వాగులు దాటే సమయంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైతే పునరావస కేంద్రాలను ఏర్పాటుచేసి వారికి కావలసిన మంచినీరు భోజనము వైద్య సహాయము ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో పాముకాటు విరుగుడు మందుతో సహా కావలసినన్ని మందులు సిద్ధంగా ఉంచుకొని ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బంది ఎవ్వరికి సెలవులు ఇవ్వరాదని ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. జ్వరాల సర్వే చేసి ఎప్పటికప్పుడు అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వాలన్నారు.
మంచినీరు ఎక్కడ కూడా కలుషితం కాకుండా పైపులైన్లు సజావుగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో మంచినీటి జలాశయాలను క్లోరినేషన్ చేయాలన్నారు. ప్రజలకు మంచినీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బంది కలగరాదని
మంచినీటి జలాశయాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలని ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోయే పక్షంలో జనరేటర్ లను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా అవసరం అయితే ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే తక్షణమే పై అధికారులకు సమాచారం అందించి పరిష్కరించు కోవాలన్నారు.
ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు వాలిపోయిన, పడిపోయిన వాటిని వెంటనే పునరుద్ధరించేందుకు వర్షపు నీరు ఉన్నచోట విద్యుత్ స్తంభాల వలన ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ హాని జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వర్షాల వలన కాలువలు పొంగి వంట నష్టం జరుగుతోందని వరి నారుమళ్లు మునిగిపోతున్నాయని అలా జరగకుండా చర్యలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఏ పంటలు ఎంత మేరకు మునిగాయో వాటి వివరాలు తెలపాలన్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ శాఖలో ముఖ్యంగా పశువులకు పశుగ్రాసం కావాలంటే వాటి వివరాలు పంపాలన్నారు. మార్కెట్ యార్డులు గోదాములు వాటి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలపాలన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న కాలువలు పొంగిపోతుంటే వాటి పూడికలు నీరు తొలగించే పనులను ఉపాధి హామీ పథకం కింద ఎక్కడికక్కడ చేపట్టాలన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం బాగుండాలని ఎక్కడ అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు
చేపట్టాలన్నారు. జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ మండల తాసిల్దార్ నుండి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతూ ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించాలన్నారు. వర్షాలకు రహదారులు ఎక్కదైనా దెబ్బతిన్న వెంటనే పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. .
ఈ టెలికాన్ఫరెన్స్లో మచిలీపట్నం, ఉయ్యూరు గుడివాడ ఆర్డీవోలు కిషోర్, విజయ్ కుమార్, పద్మావతి, జల వనరుల శాఖ ఎస్ .ఈ. టిఐహెచ్ ప్రసాద్, డిపిఓ నాగేశ్వర్ నాయక్,డిఎంహెచ్వో డాక్టర్ గీతా బాయ్, డ్వామా పిడి జివి సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, విద్యుత్ శాఖ అధికారి భాస్కరరావు తదితర జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తహసిల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.