Saturday, November 23, 2024

దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి రండి: వైసీపీకి కోట్ల సవాల్

దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి వస్తే ప్రజల్లోనే తేల్చుకుందామని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సీఎం జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులకు సవాల్ చేశారు. గురువారం కర్నూలు జిల్లా బూడిదపాడు గ్రామంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను కట్టకుంటే ఇళ్ళ ముందు చెత్త వేయడం, నీటి పన్ను కట్టకుంటే కులాలను తొలగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయని, విద్యుత్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విద్యుత్ కోతలతో విద్యార్థులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే సాగునీటి ప్రాజెక్టులైన గుండ్రేవుల వేదవతి ఆర్డిఎస్ఎల్ఎల్ సి తో పాటు పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని గెలిచిందన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలంతా గాలికి గెలిచారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ప్రభుత్వాన్ని వద్దు  చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. ప్రజలలో ఎవరు దమ్ము ఎంత ఉందో చూసుకుందామని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ తుగ్లక్ పాలనలో ప్రతిదానికి పన్ను వేసి పేద ప్రజల రక్తం తాగుతున్నారని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని 2 లక్షల 50 వేల కోట్లకుపైగా అప్పులు చేశారని మండిపడ్డారు. ఈ దివాలాకోరు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు పుష్కలంగా అందిస్తామని తెలిపారు. గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పా  వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. ఒక్క ఇల్లు కూడా కట్ట లేని జగన్ సర్కార్.. తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పథకాలకు జగనన్న అంటూ పేర్లు పెట్టుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement