Friday, November 15, 2024

Kothacheruvu – సంచార జాతిపై వివక్ష .. పేద బిడ్డలకు ఫుడ్‌ దూరం

(కొత్తచెరువు, ప్రభ న్యూస్) ‍ తన అనుచర వ్యక్తికి మధ్యాహ్న భోజన ఏజెన్సీ కొనసాగించ లేదని అక్కసుతో ఓ సర్పంచి భర్త రెచ్చిపోయిన ఘటన ఇది. స్కూలు పిల్లల నోటికాడ బువ్వను అడ్డుకునేందుకు సర్పంచి భర్త అడ్డగోలు వ్యవహారం ఇది, శ్రీసత్యసాయి జిల్లా ఇరగంపల్లి సర్పంచ్ గంగ రత్న భర్త శ్రీనివాసులు, డీలర్ రమేష్ కలిసి వంగంపల్లి ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం వేసినఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. కొత్తచెరువు మండల పరిధిలోని వంగంపల్లి ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు స్థానిక విద్యార్థులు సహా కొత్తచెరువు సమీపంలోని 20 మంది సంచార జాతుల పిల్లలు చదువుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రత్యేక చొరవ కారణంగా మండల కేంద్రం కొత్తచెరువులోని సంచార జాతుల కుటుంబాలకు ఆధార్ కార్డులు మంజూరు చేశారు. దీంతో 20 మంది సంచార జాతుల పిల్లలు వంగంపల్లి ప్రాథమిక పాఠశాలలో చదవడానికి అవకాశం ఏర్పడింది.

ఇంటి వ‌ద్దే వంట‌.. వ‌ద్ద‌న్నా విన‌డంలేదు
కొత్తచెరువు నుంచి రోజు ఆటోలో వీరిని వంగంపల్లి ప్రాథమిక పాఠశాలకు తరలిస్తున్నారు. వీరికి రోజు అల్సాహారం సహా ఆటోలో గుడిసెకు చేర్చేందుకు శ్రీ సత్యసాయి బాబా భక్తులు నెలకు 23,500 ఖర్చు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే వంగంపల్లి ప్రాథమిక పాఠశాలలో గతం నుంచి మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వహిస్తున్న కళావతి పాఠశాల ఆవరణలో భోజనం తయారు చేయలేదని అలా తయారు చేయకపోతే తొలగిస్తామని ప్రధానోపాధ్యాయుడు గోపి హెచ్చరించారు. పాఠశాలలోని బియ్యం తీసుకువెళ్లి ఇంటి దగ్గర అన్నం వండి రోజు పాఠశాలకు అరకొరగా భోజనం తీసుకువస్తోంది. విద్యార్థులకు సరిపడగ భోజనం లేనందున పాఠశాల ఆవరణలోని వంట చేయాలని హెచ్ ఎం సూచించారు. కానీ పాఠశాల ఆవరణంలో వంటకు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు కళావతి ఒప్పుకోలేదు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో హెచ్ఎం గోపీ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో తల్లిదండ్రుల కమిటీ నిర్ణయం మేరకు వేరే వ్యక్తికి మధ్యాహ్న భోజన ఏజెన్సీని అప్పగించారు. సంక్రాంతి సెలవులు అనంతరం జనవరి 23 నుంచి 31వరకూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి బయట వ్యక్తులతో వంట చేయించి విద్యార్థులకు భోజనం వడ్డించారు.

పాఠశాల గేటుకు తాళం.. ఎందుకిలా?
మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకురాలు కళావతిని తొలగించారని కోపంతో ఇరగంపల్లి సర్పంచ్ భర్త శ్రీనివాసులు, డీలర్ రమేష్ కలసి శుక్రవారం ఉదయం పాఠశాల గేటుకు తాళం వేశారు. శుక్రవారం ఉదయం పాఠశాలలకు విధులు నిమిత్తం ప్రధానోపాధ్యాయుడు గోపి ఉపాధ్యాయులు రాగా పాఠశాల గేటుకు తాళం వేసిన విషయాన్ని గమనించి ఎవరు వేశారని తెలుసుకోగా సర్పంచ్ భర్త శ్రీనివాసులు, డీలర్ రమేష్ లు వేశారని గ్రామస్తులు తెలిపారు. దీంతో తక్షణమే ప్రధానోపాధ్యాయుడు గోపి ఫోన్ లో శ్రీనివాసులతో ఎందుకు గేటుకు తాళం వేశారని ప్రశ్నించారు. తమ వ్యక్తిని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నుంచి తొలగించినందునే పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశామని చెప్పారు. ఈ అంశాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టి కి తీసుకు వెళ్లారు. తక్షణమే స్పందించి తాళం తీయించారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రత్యేక చొరవ వల్ల సంచార జాతుల బిడ్డలకు చదువుకునే అవకాశం కల్పిస్తే… ఇలా పాఠశాల కు తాళం వేసి సంచార జాతుల పిల్లలకు చదువును దూరం చేస్తారా? అని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచి చర్య పై గ్రామస్తులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement