Monday, November 18, 2024

AP: మహాశివరాత్రికి కోట‌ప్పకొండ‌ రెడీ.. వైభవంగా తిరునాళ్ల‌ ఏర్పాట్లు

నరసరావుపేట (ప్రభ న్యూస్‌): ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద జాతరకు రంగం సిద్ధమైంది. 10 లక్షలకు పైగా భక్తులు తరలిరానున్నట్లు అంచానాతో  3 వేల మంది పోలీస్‌ సిబ్బందితో పహరా కాస్తున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధికెక్కింది. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే కోటప్పకొండకు రాష్ట్రపండుగ హోదా దక్కింది. దీంతో ప్రతిష్టాత్మకంగా ఏటా మహాశివాంత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప‌ర్యవేక్షణ‌లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

త్రికోటేశ్వర స్వామి దర్శనం సర్వపాప హరణమని భక్తులు నమ్ముతుంటారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్ల రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా చరిత్రపుటల్లోకి ఎక్కింది. ఈ మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి ఏటా భక్తులు తరలివస్తుంటారు. మహాశివరాత్రి జాగరణ చేయడం వల్ల మానవ జీవితానికి మోక్షం, పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.  రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుండటంతో ముందుగానే రోడ్ల విస్తరణ చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా అధికారులు కృషిచేశారు. కొండపై దక్షిణామూర్తి విగ్రహం, నందీశ్వరుని విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి కోటప్పకొండలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు.

 త్రికోటేశ్వరుని దర్శనంతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో జింకల పార్కు, కాళింది మడుగు, ఎక్వేరియం, బోట్‌ షికార్‌, టాయ్‌ ట్రైన్‌, పూల తోటలు ఏర్పాటు చేసి చిన్నపిల్లల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. మార్చి ఒకటవ తేదీన జరిగే మహాశివరాత్రి పండుగకు నరసరావుపేట, పరిసర ప్రాంతాల ప్రజలు మొక్కుబడి ప్రభలు, విద్యుత్‌ ప్రభలు, అనేక సాధారణ ప్రభలను ప్రతి ఏటా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. దీంతో పట్టణంలో  కొన్నిరోజులుగా సందడి వాతావరణం నెలకొంది. భక్తులు మొక్కుబడి ప్రభలను సిద్ధం చేసి స్వామి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. పట్టణ ప్రధాన రహదారులన్నీ విద్యుత్‌ కాంతులు వెదజల్లుతున్నాయి.

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణమంతా విద్యుత్‌ కాంతులు విరజిల్లేలా సిద్ధంచేసి మహా శివరాత్రిరోజు కోటయ్య స్వామి దర్శనానికి రంగం సిద్ధం చేశారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆధ్వర్యంలో 3 వేల మంది పైచిలుకు పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా పహరా కాస్తున్నారు. వీఐపీ , వీవీఐపిలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషిచేసింది. తొలిఏకాదశి సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. అభిషేకాలు, అఖండ దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.  చేదుకో కోటయ్యా, చేదుకో, మమ్మాదుకోవయ్యా అంటూ భక్తుల హాహా కారాలతో కోటప్పకొండ మార్మోగుతుంది. మహాశివరాత్రి పర్వదినం సమీపంచే తరుణం మరికొద్ది గంటల్లోకి వచ్చింది. పిల్లలకోసం ఆటబొమ్మలు, చెరుకుగడలు, రంగుల రాట్నాలతో కోటప్పకొండ కళ కళ లాడుతుంది. ఈ ఏడాది నీటి ఎద్దడి కూడా లేకపోవడంతో కోటయ్య స్వామి భక్తులు స్నానమాచరించేందుకు కాల్వలకు నీరు వదలడంతో కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement