తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధులలో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. శ్రీవారికి శ్రీభూదేవులు ఇరువైపుల ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) బంగారు. స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. శ్రీవారి ఇల్లు, ఇల్లాలు బంగారం, ఇంట పాత్రలు బంగారం.
సింహాసనం బంగామే. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం. అనంతరం స్వామివారు వసంతోత్సవ మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చకులు వసంతోత్సవ అభిషేకాదులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.