Tuesday, November 26, 2024

మా బాధ‌లు విన‌ప‌డ‌టం లేదా … చిన్నారి బ‌ధిరుల ఆవేద‌న

అమరావతి, ఆంధ్రప్రభ: వాళ్ళు విధి వంచితులు.. పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్య బారినపడ్డారు. రోజు గడవడమే కష్టంగా మారిన కుటుంబా ల్లో పుట్టిన వాళ్లకు అత్యంత ఖరీదైన కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీ చేయించు కొనే ఆర్థిక స్థోమత ఏమాత్రం లేదు. ఆరోగ్య శ్రీ పథకంలో ఈ సర్జరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ గత ఏడాదిగా ఆపరేషన్స్‌ చేయడం లేదు. నిబంధనల ప్రకారం ఐదేళ్ళ లోపు చిన్నారులకు మాత్రమే ఆరోగ్య శ్రీలో ఆపరేషన్స్‌కు అర్హులు. కళ్ళముందే వయసు దాటి పోతున్న తమబిడ్డల్ని చూసి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రుల్ని తల్లడిల్లిపోతున్నారు.
చెవిటి.. మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీ లపై ప్రత్యేక దృష్టి సారించారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలనే ఇక్కడ కూడా అమలు చేయాలని దిశా నిర్ధేశం చేశారు. కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ సర్జరీని దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన ఘనత ఏపీది. ఇదంతా ఒకప్పుడు.. ప్రస్తుతానికి వస్తే ఏడాది కాలంగా ఆపరేషన్లు జరగడం లేదు.

ఇదీ ఆలోచన…
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అయ్యాక కాక్లియర్‌ ఆపరేషన్స్‌పై దృష్టి పెట్టారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనే కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అమర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అప్పటి వరకు రెండుమూడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్స్‌ చేసేవారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఆపరేషన్స్‌ నిర్వహిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే సొమ్ము కూడా ప్రభుత్వాసుపత్రులకే వస్తోందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రుల్లో సుమారు 100కు పైగా ఈఎన్‌టీ సర్జన్లు ఉన్నారు. వీరిలో సీనియర్లు, నైపుణ్యం ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు. అప్పుడే పుట్టిన శిశువులు, విలేజ్‌ క్లినిక్స్‌కు వచ్చే చిన్నారులు, స్కూల్‌ విద్యార్థుల్లో చెవిటి, మూగ లోపాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా కంటివెలుగు తరహాలో పరీక్షలు నిర్వహించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అవసరం మేరకు కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ సర్జరీ చేయాలని ఆదేశించారు.

ఇప్పుడిలా…
వైజాగ్‌, విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ సర్జరీలు ఏడాది క్రితం వరకు నిర్వహిం చేవారు. గతంలో చేసిన సర్జరీలు అన్నీ సక్సెస్‌ అయ్యాయి. ఇంప్లాంటేషన్‌ 4.70 లక్షలు ఖరీదు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ ఐదు లక్షలు ఆసుపత్రికి ఇచ్చేవారు. ఇంప్లాంట్స్‌ను టెండర్ల ద్వారా బయట కొనుగోలు చేసేవాళ్లు. ఇంప్లాంట్స్‌కు సంబంధించిన నగదు చెల్లింపుల్ని ప్రభుత్వం ఏడాదిగా ఇవ్వడం లేదు. వందలాదిమంది బధిర చిన్నారులు ఆపరేషన్స్‌ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. టెండర్‌కు సంబంధించిన వెండర్‌కు విశాఖలో సుమారు రూ.40 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. సర్జరీలు ఆగిపోవడంతో డాక్టర్లు ఖాళీగా ఉంటున్నారు. పూర్తిస్థాయిలో ఎక్విప్‌మెంట్స్‌ ఉండి కూడా ఇంప్లాంట్స్‌ లేక సర్జరీలు చేయలేని దుస్థితి వెంటాడుతోంది. ప్రభుత్వమే ఇంప్లాంట్స్‌ను కొనుగోలు చేసి ఇవ్వొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వైఎస్‌ హయాంలో శ్రీకారం
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకంలో కాక్లియర్‌ ఇంప్లాట్స్‌ చికిత్సను చేర్చారు. అప్పట్లో ఆపరేషన్‌కు రూ.6.5 లక్షల చొప్పున ఖర్చు చేసేవారు. మూగ పిల్లలు మాట్లాడటమే లక్ష్యంగా ఖర్చుకు వెనుకాడకుండా 2007 నుంచి ఆపరేషన్స్‌ నిర్వహించేవారు. ఆరేళ్ళ లోపు చిన్నారులు పుట్టుకతో మూగ, చెవుడు ఉంటే ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్స్‌ చెెసేవారు. కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ వేయడమే కాకుండా ఏడాది పాటు ఉచిత చికిత్స నిర్వహించేవారు. ఆరేళ్ల లోపు నిబంధన వల్ల ఈ పథకాన్ని చాలామంది అందుకోలేకపోతున్నారని తెలియడంతో నాడు వైఎస్‌ఆర్‌ ఆ నిబంధనల్ని 12కు సవరించారు. దీంతో వైఎస్‌ఆర్‌ హయాంలో సుమారు 1,200 మంది చిన్నారుల కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అమర్చారు. ఇందు కోసం అప్పట్ల్లోనే సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేశారు.


ని’బంధ’నలు
2014 తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కాక్లియర్‌ చికిత్సకు నిబంధనల్ని విధించింది. కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అర్హతను ఆరేళ్ళ నుంచి రెండేళ్ళకు కుదించారు. చెవుడు, మూగ ఉందో లేదో నిర్ధారించేందుకే ఆ రెండేళ్ల సమయం సరిపోయేది. దీంతో చాలామంది చిన్నారులు కాక్లియర్‌ చికిత్సకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఏడాదికి 200 పైనే చికిత్సలు నిర్వహిస్తే టీడీపీ హయాంలో ఆ సంఖ్య 50కు మించి దాటక పోవడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభంలో ఆపరేషన్స్‌ బాగానే జరిగినప్పటికీ ఏడాది కాలంగా నిల్చిపోయాయి. వందల సంఖ్యలో బధితులు ఆపరేషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ దీనిపై దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -

బ్రేక్‌ పడింది
విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేయడానికి అన్ని వసతులు, వైద్యులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంప్లాంట్స్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో సర్జరీలకు బ్రేక్‌ పడింది. ఈ కారణంగానే ప్రస్తుతం సర్జరీ చేయడం లేదు. ప్రభుత్వం వాటిని మంజూరు చేస్తే పూర్తిస్థాయిలో సర్జరీలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
డాక్టర్‌ జీవన్‌ ప్రదీప్‌.. ప్రభుత్వ ఇఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ . విశాఖపట్నం

Advertisement

తాజా వార్తలు

Advertisement