Saturday, November 16, 2024

Kitchen Bomb – కూర‌”గాయాలు” …. మార్కెట్ లో వెజిట‌బుల్ మంట‌..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటు-తున్నాయి. గత కొన్ని వారాలుగా వర్షాలు కురవకపోవడంతోపాటు- తీవ్రమైన వడగాడ్పుల కారణంగా కూరగాయల తోటల్లో దిగుబడులు గణనీయంగా పడిపోయా యి. ఫలితంగా మార్కెట్‌ అవసరాలకు సరిపడా కూరగాయల ఉత్పత్తి జరగడం లేదు. దీంతో కూరగయాల రేట్లు- అమాంతం పెరిగిపోయాయి. ఏ రకం కూరగాయలు చూసినా రైతు బజారు లోనే రూ. 30 నుండి రూ. 40 వరకూ కిలో ధర పలుకుతోంది. ఇక ఆకు కూరల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. గతంలో రూ. 10కి నాలుగు కట్టల ఆకు కూరలిచ్చిన పరిస్థితి ఉండగా ప్రస్తుతం డిమాండ్‌ను బట్టి రూ. 10కి రెండు లేదా మూడు కట్టల ఆకు కూరలు ఇస్తున్నారు. పచ్చిమిర్చి పావు కిలో రూ. 25 నుండి రూ. 30 వరకూ ఉంది. ఇలా ఏ రకం కూరగాయ లు తీసుకున్నా రెండు, మూడు రెట్లు ధరల పలుకుతున్నాయి. కొన్ని కొన్ని రకాలైతే ఏకంగా నాలుగైదు రెట్ల మేర థర అధికంగా ఉంటోంది. ఇక బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలు చెప్సాల్సిన పని లేకుండా పోయింది. ఫలితంగా సాధారణ, మధ్యతరగతి కుటు-ంబ బడ్జెట్‌పై కూరగాయల రేట్ల ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఇటీవల కురిసిన అకాల వర్షాలు వివిధ రకాల కూరగాయల ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేయగా, ప్రస్తుతం వీస్తున్న వేడిగాలులుఉద్యానవన పంటలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపాయి, ఫలితంగా దిగుబడి సరిగా లేకుండా పోయింది.

రూ. 200 పెడితే వారానికి సరిపడా కూరగాయలు
గతంలో రూ. 200 పెట్టి కూరగాయలు తీసుకుంటే నలుగురు ఉండే కుటుంబానికి వారం పాటు సరిపడా కూరగాయలు వచ్చేవి. కానీ, ఇప్పుడు రూ. 200 పెడితే రెండు లేదా మూడు రోజుల పాటు సరిపడా కూరగాయలు మాత్రమే వస్తున్నాయని, అవి కూడా ఎండ వేడికి పాడైపోయే పరిస్థులు నెలకొన్నాయని సగటు జీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐదారుగురు ఉండే కుటుంబంలో దీని ఖర్చులు రెట్టింపయ్యాయి. నెలకు అదనంగా రూ. వెయ్యి నుండి రూ. 1,500 వరకూ అదనంగా ఖర్చయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చుట్టాలు, ఫంక్షన్లు వంటివి ఉంటే ఈ ఖర్చు మరింతగా పెరుగుతోందని వారు పేర్కొంటున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌, హాస్టళ్లు పున: ప్రారంభం కూడా…
ఈ పరిస్థితులకు తోడు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకోవడంతో వివిధ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో హాస్టల్స్‌ ప్రారంభమయ్యాయి. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది వినియోగదారులకు రెట్టింపు కష్టాలు తెచ్చిపెడుతోంది. సరఫరా మందగమనం మరియు కూరగాయలకు డిమాండ్‌ పెరగడం ధరలు మరింత పెరగడానికి దారితీశాయని రైతు బజార్‌ వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్లలో గత 10 రోజులుగా కూరగాయల సరఫరా డిమాండ్‌కు తగినట్లుగా లేకపోవడంతో బీన్స్‌, పొట్లకాయ, టమాటా, బెండకాయలు, దొండకాయ, బీరకాయ వంటి ఇతర కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. పది రోజుల క్రితం కేజీ రూ.75కి అమ్మిన బీన్స్‌ రి-టైల్‌ ధర ప్రస్తుతం కిలో రూ. 130కు చేరింది. అలాగే పుదీనా, కొత్తిమీర ధరలు కూడా గత రెండు వారాలుగా పెరిగాయి. గతంలో కట్ట రూ. 10 ఉండేవి ఇప్పుడు ఏకంగా రూ. 20కు చేరాయి. ఇక ఆకు కూరల పరిస్థితి కూడా ఇంతకంటే దారుణంగానే ఉంది.

మామిడి, నిమ్మకు దెబ్బ
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వర్షాలు, వడగళ్ల వానల కారణంగా మామిడికాయల రాక తగ్గింది. దీంతో పచ్చి మామిడి కాయల ధరలు కూడా పెరిగాయి. వేసవి కూడా నిమ్మకాయలకు డిమాండ్‌ పెరగడానికి దారితీసింది, నిమ్మ ఒక్కో కాయ రూ.3కి బదులుగా రూ.5కి విక్రయిస్తున్నారు. గత వారం రోజుల్లో పొట్లకాయ ధరలు రెండింతలు పెరిగి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో పాటు- బెండకాయ, దొండకాయ, బీరకాయ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయి.
ఎండ వేడికి వడబడిపోతున్నాయి

- Advertisement -

తెల్లవారుజామున తెచ్చిన కూరగాయలు ఎండవేడిమికి ఎండుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో కూరగాయల విక్రయాలు దెబ్బతింటు-న్నాయి. కూరగాయల తాజాదనాన్ని నిలుపుకోవడం కోసం అష్ట కష్టాలు పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వేడిగాలుల నుండి ఉపశమనం లభించకపోవడంతో, వినియోగదారులు వాడిపోయిన కూరగాయలను కొనుగోలు చేయడం లేదని వ్యాపారుల చెబుతున్నారు. ఇది పెద్దమొత్తంలో అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వారు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement